బాబు పోవాలి…జాబు రావాలి…ఇది 2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ సీఎం జగన్ నినాదం. అన్న వస్తున్నాడు…తమ్ముళ్లకు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు….అంటూ జగన్ ప్రతి ప్రచార సభలోనూ ఊదరగొట్టారు. జగనన్న మాట ఇస్తే మడమ తప్పడు అంటూ సినిమా డైలాగులు కొట్టారు. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత ఏ ఒక్క ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన పాపాన పోలేదు.
వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, అడపాదడపా కొన్ని ఉద్యోగాలు మినహా…హామీ ఇచ్చిన రేంజ్ లో ఉద్యోగాల భర్తీగానీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ గానీ రిలీజ్ చేయలేదు. ఇక, తాజాగా ముచ్చటగా మూడో సారి కూడా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ను జగన్ రిలీజ్ చేయకపోవడంతో నిరుద్యోగులంతా సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. మూడు సంవత్సరాల జనవరి 1వ తారీకులు వచ్చిపోయాయని…కానీ, జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదని నిరుద్యోగులు సెటైర్లు వేస్తున్నారు.
మామూలుగా అయితే ఏప్రిల్ 1న జనాలను ఫూల్స్ ను చేస్తుంటారని, కానీ, జగనన్న మాత్రం నిరుద్యోగులను ప్రతి ఏటా జనవరి 1న ఫూల్స్ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. జగనన్న ముచ్చటగా మూడు అబద్ధాలు చెప్పారని….మరో రెండేళ్ల పాటు ఇంకో రెండు చెప్పడం గ్యారెంటీ అని అంటున్నారు. ఏదేమైనా….జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని…జగన్ పోవాల్సిందేనని చాలామంది నిరుద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.