టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు 14 రోజుల రిమాండ్ కారణంగా జైలుకు వెళ్లారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన్ని సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. దీంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇప్పుడు బాబు ఎలాగో జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వైసీపీ టార్గెట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఆదివారం రాత్రి విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. విమానానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో రోడ్డు మార్గంలో వెళ్లాలని చూశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పడుకుని పవన్ నిరసన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం జగన్ రాజకీయ కుట్ర దాగి ఉందని పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు పవన్ పై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసి, స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన బాబుకు పవన్ ఎలా మద్దతిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అవినీతి పరుడైన బాబుకు పవన్ అండగా నిలబడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలంటూ వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఓ వైపు ఏసీబీ కోర్టు బాబుకు రిమాండ్ విధించడం.. అదే సమయంలో పవన్ మద్దతు తెలపడం వైసీపీకి అస్ర్తం లాగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాబు పేరు చెప్పి పవన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇది పవన్ కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.