వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బలమైన నియోజకవర్గాల్లో ఎలానూ పార్టీనే విజయం దక్కించుకుంటుంది. ఈ విషయంలో పార్టీ అధినేత సీఎం జగన్‌కు ఎలాంటి సందేహం లేదు. అయితే. ఇప్పుడు కావాల్సింది.. పార్టీకి పెద్దగా బలం లేని నియో జకవర్గాలు, టీడీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాలే. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది.
గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎన్నికలకు ముందు పరుచూరు నియోజకవర్గం హాట్ టాపిక్ కావడం గమనార్హం. ఇక్కడ టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.. గత రెండు ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని భావించిన వైసీపీ… ఇక్కడ వ్యూహాత్మకంగాపావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత రావి రామానాథం బాబు ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇలా వరుసగా ఇక్కడ కొత్త కొత్త ఇన్‌చార్జ్‌లు వస్తున్నా పార్టీ బలోపేతం అవుతోన్న దాఖలాలు లేవు.
గత నాలుగేళ్లలో ముగ్గురు ఇన్‌చార్జ్‌లు మారినా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా పార్టీ గ్రాఫ్ పెరిగినట్టు వైసీపీ చేయించుకున్న ఏ ఒక్క సర్వేలో కూడా చెప్పలేదు. దీంతో ఎన్నికలకు రెండు నెలల ముందు ఎమ్మెల్యే ఏలూరిని టార్గెట్ చేసే ప్రక్రియ కూడా గట్టిగా మొదలైంది. ఆయన వ్యాపారాలను టార్గెట్ చేయడం, జీఎస్టీ అవకతవకలు ఎత్తిచూపడం, చివరకు స్థానికంగా గ్రానైట్ వ్యాపారులపై దాడులు ఇవన్నీ ఒకేసారి మొదలయ్యాయి. ఏలూరి అరెస్టుకు కూడా రంగం రెడీ అయింది. ఇప్పటికే కొందరు గ్రానైట్ పరిశ్రమ యజమానుల ను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని.. గ్రహించిన ఏలూరి.. వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. ఇదిలావుంటే రాజకీయంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఏలూరిని ఓడించేందుకు ఇప్పుడున్న ఇన్చార్జ్ ఆమంచినే కంటిన్యూ చేయాలా ? లేదా 2014లో ఏలూరిపై ఓడిన గొట్టిపాటి భరత్‌ను దించాలా ? లేదా మరో వ్యక్తిని రంగంలోకి దించాలా ? అని తీవ్ర తర్జన భర్జనలు పడుతోంది. ఏదేమైనా ఏలూరి జోరుకు అడ్డకట్ట వేసేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోన్నా ఆ దిశగా ఫలితం వచ్చేలా లేదు.