అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలను బెదిరించడం, వారి వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను దెబ్బకొట్టడం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నైజం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పనితీరును, జగన్ వైఫల్యాలను ప్రశ్నించిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, పట్టాభి వంటి నేతలను అరెస్టు చేయడం, అక్రమ కేసులతో వేధించడం జగన్ కు పరిపాటి అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
గతంలో సంగం డెయిరీలో అవకతవకలంటూ టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను జగన్ అరెస్టు చేయించడం కలకలం రేపింది. అంతేకాదు, సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు జగన్ దిగుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే, కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆ వ్యవహారంలో జగన్ వెనక్కి తగ్గారు. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని.. డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. ఆ తర్వాత నరేంద్ర బెయిల్ పై బయటకు వచ్చారు.
అయితే, ఈ పరిణామాలు మింగుడపడని జగన్…తాజాగా మరోసారి ధూళిపాళ్ల నరేంద్రను వెంటాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌కు దేవాదాయ శాక నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సిక్స్ ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ నోటీసులను జారీ చేశారు. అంతేకాదు, వారం రోజుల్లో ఆ నోటీసులకు సమాధానమివ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టారు.
వాస్తవానికి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఆస్పత్రి నడుస్తోంది. పాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం ఫీజుతోనే ఆ ఆస్పత్రిలో వైద్యం అందజేస్తున్నారు. ఇలా పేదలకు సాయపడుతున్న ట్రస్ట్, ఆస్పత్రిని ఇబ్బంది పెట్టేలా నోటీసులు పంపడంపై రైతులు, పాల ఉత్పత్తిదారులు మండిపడుతున్నారు.