మార్గదర్శిపై కేసు నమోదైంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈనాడు సంస్థల అధినేత.. రామోజీ గ్రూప్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న చెరుకూరి రామోజీరావును ఏ1గా పేర్కొంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన కోడలు శైలజను ఈ కేసులో ఏ2 గా పేర్కొంది. వారు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంది.
విపక్ష నేతగా ఉన్న వేళలో.. వైఎస్ జగన్ స్వయంగా రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీరావును కలవటం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపుతున్న వైనంపై జగన్ పలుమార్లు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే..మార్గదర్శిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు సోదాలు నిర్వహించినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.
అయితే.. తాజాగా కోర్టు సెలవులు చూసుకుని తెలివిగా శనివారం తెల్లవారుజాము నుంచి ఏపీ సీఐడీకి చెందిన అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన కార్యాలయాల మేనేజర్లు.. ఇతర సిబ్బంది నివాసాల్లో తనిఖీలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.
శనివారం సాయంత్రానికి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ రామోజీరావుపైనా.. ఆయన కోడలు శైలజ పైనా.. సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా చెరుకూరి రామోజీ రావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా బి. శ్రీనివాసరావు ఇతరులను చేర్చారు. ఉదయమే మొదలైన సోదాలు రాత్రి వరకు సాగాయి. అనంతరం రామోజీతో పాటు ఆయన కోడలు ఇతరుల మీద సెక్షన్ 120బీ, 409, 420, 477(ఏ), రెడ్ విత్ 34 ఐపీసీ, 76 సీఎఫ్ఏల కింద మేనేజర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు.
ఇదంతా కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వీఎస్ఎస్ క్రిష్ణారావు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. మార్గదర్శి మేనేజర్ల ఇళ్లకు వెళ్లిన అధికారులు.. వారిని బలవంతంగా తమతో పాటు కార్యాలయాలకు తీసుకొచ్చి తలుపులు తెరిపించినట్లుగా తెలుస్తోంది.
విజయవాడ ఎంజీ రోడ్ లో ఉన్న మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయ మేనేజర్ శ్రీనివాస్ పడమట లంకలో ఉంటారు. సీఐడీ.. రిజిస్ట్రేషన్ శాఖల అధికారల టీంలు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను కారులో ఎక్కించుకొని మార్గదర్శి ఆఫీసుకు తీసుకొచ్చారు. మార్గదర్శి ఆఫీసు తలుపులు మూసి మరీ ఆయన్ను విచారించారు.
దీనిపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా ప్రశ్నిస్తారు? అంటూ వారు తప్పు పట్టారు. విశాఖలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. శనివారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. సోదాలు శనివారమే కాదు ఆదివారం కూడా సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఉదంతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.