పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిన సంగతి తెలిసిందే. పోలవరం డ్యామ్ నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం నిధులు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం ఖర్చుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో, నిర్వాసితుల కోసం ఏపీ సర్కార్ పై రూ.29 వేల కోట్ల భారం పడనుంది. దీంతో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో కోత వ్యవహారంపై జగన్ సర్కార్ అసంతృప్తితో ఉంది. అయితే, ఆ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ టార్గెట్ చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
పోలవరం అంచనా వ్యయాన్ని చంద్రబాబు రూ.55 వేల కోట్లకు పెంచారని జగన్ నాడు విమర్శించారు.అయితే, గతంలో విపక్ష నేతగా జగన్ వ్యాఖ్యలే నేడు ఏపీ ప్రభుత్వానికి శాపంగా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరానికి 2014 అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లు సరిపోతాయని జగన్ గతంలో విపక్ష నేతగా కేంద్రానికి జగన్ లేఖలు రాశారు. ఆ లేఖల వల్లే పోలవరం నిధుల్లో కేంద్రం నేడు కోత విధించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ కోతల వెనుక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఉన్నారని సీఎం జగన్ భావిస్తున్నారన్న టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే నిర్మలా సీతరామన్ పై ఏపీ ఆర్థిక సలహాదారు సుభాష్ చంద్ర గార్గ్ తో జగన్ విమర్శలు గుప్పించారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో సీతారామన్ దగ్గర పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన గార్గ్ ను జగన్ ఏరికోరి నియమించుకున్నారు. నిర్మలా సీతారామన్ మనస్తత్వం చాలా విచిత్రమైనదని, సీతారామన్ తో కలిసి పనిచేయడం కష్టమని గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏడాది క్రితం నిర్మల దగ్గర పనిచేస్తూ రాజీనామా చేసి గార్గ్ తాజాగా నిర్మల వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించడం అనుమానాలకు తావిస్తోందని జాతీయ మీడియా అంటోంది. గార్గ్ వ్యాఖ్యలపై సీతారామన్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. దీంతో, కేంద్ర మంత్రిపై బురద చల్లితే పోలవరం నిధులు వస్తాయా? అంటూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల మొత్తం కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల్లో ఉండదు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ధృవీకరించాల్సిన అథారిటీ డీపీఆర్ 2కు ఉంటుంది. కొద్ది రోజుల క్రితం న్యాయవ్యవస్థనే తప్పుపట్టిన జగన్….ఇపుడు కేంద్ర ఆర్థిక మంత్రిపై విమర్శలు చేయడం వల్ల ఏపీకి నష్టమన్న భావన వస్తోంది. మరోసారి జాతీయ స్థాయిలో ఏపీ సర్కార్ పరువు పోగొట్టుకుందన్న టాక్ వస్తోంది. మరి, ఈ వ్యవహారాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారన్నది చర్చనీయాంశమైంది.