తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఎక్కువన్న వాదన చాలాకాలంగా ఉంది. ఏపీలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయపరమైన పోరు నడుస్తోందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఇక, ప్రజారాజ్యం రాకతో జనసేన అవిర్భావంతో ఏపీలో మూడో బలమైన సామాజిక వర్గమైన కాపులు కూడా కుల పోరులో తలపడుతున్నారన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. స్వయంగా కమ్మకులాన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్…టీడీపీ హయాంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే అత్యున్నత పదవులు కట్టబెట్టారని విమర్శలు చేశారు. అదేపనిగా ప్రచారం చేశారు. నిజానికి అందులో అనేక అసత్యాలు ఉన్నాయి. ఎదుటి వారిపై కులనింద వేసిన జగన్ తాను అధికారంలోకి వచ్చాక జనరంజకంగా పదవులిస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీఎం కాాగానే అర్హత ఉన్నా లేకపోయినా 700 మంది రెడ్లకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. టీటీడీతో సహా ఎక్కడ ప్రాధాన్య పోస్టులున్నా అవి రెడ్లకు మాత్రమే కేటాయిస్తున్నారు.
జగన్ కు కులాభిమానం దురభిమానంగా మారిందని విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. అయినా ఇవేమీ పట్టని జగన్… రెడ్లకు పదవిలిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమరావతిలో ఒక కులం ఉండేందుకే రాజధానిని గత పాలకులు రూపొందించారని, అందుకే తాను దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు జగన్ తాజాగా తూర్పుగోదావరి మీటింగులో చెప్పడం చర్చనీయాంశమైంది. రాజధాని అమరావతి రెండు నియోజకవర్గాల్లో విస్తరిస్తే అందులో ఒకటి (తాడికొండ) … ఎస్సీ నియోజకవర్గం. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గంలో కమ్మ వాళ్లు పది శాతం కూాడా లేరు. కేవలం చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టాలని… చంద్రబాబును భవిష్యత్తులో ఎవరూ నమ్మకూడదు అని, అందుకోసం అతని నిర్ణయాలన్నీ తప్పుపట్టడం, లేదా రద్దు చేయడం అన్న కాన్సెప్టులో జగన్ సర్కారు ముందుకు సాగుతోంది.
రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన కమ్మ సామాజిక వర్గం వారికోసమే అమరావతి రాజధాని అని జగన్ గతంలో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ జగన్ కుల ప్రస్తావన తెచ్చి కుల రాజకీయం చేశారు జగన్.
డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుందని కొందరు కోర్టులో పిటిషన్ వేశారని జగన్ అన్నారు. అయితే, డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే కుల అసమతుల్యం కాదని తెలిసి కూడా కుల విద్వేషం రెచ్చగొట్టడానికి జగన్ ప్రయత్నించారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటే జనాభా అసమతుల్యత అని, కానీ జగన్ దానిని కులపరమైన అసమతుల్యత అని తప్పుడు అర్థం వచ్చేలా చెప్పారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అమరావతిలో ఒక కులం ఉండేందుకే రాజధాని అని పరోక్షంగా జగన్ కమ్మ కులాన్ని ఉద్దేశించి అన్నారు. కొందరి కోసం కాకుండా అందరికోసం రాజధాని ఉండాలనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామంటూ జగన్ సమర్థించుకున్నారు. కులం ప్రస్తావన తెచ్చి….ఏపీ ప్రజల్లో మూడు రాజధానుల విషయంలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోసారి కమ్మ సామాజిక వర్గంపై జగన్ వేసిన బాణం ఎంతవరకు దూసుకుపోతుందో వేచి చూడాలి.