సాధారణంగా రాష్ట్రాల్లోని మెజారిటీ పథకాలకు కేంద్రం కూడా తన వంతు సాయం చేస్తుంది. కానీ, ఆ క్రెడిట్ అంతా తామే తీసుకోవడానికి దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తుంటారు. ఇక, కేంద్ర పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేయడం, కేంద్రం ఇచ్చిన ముప్పావలా నిధులకు రాష్ట్రం నుంచి పావలా కలిపి మొత్తం రూపాయి మాదేనని చెప్పడం చాలా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే, ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన జగన్ …ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీట్ చేశారు.
మొన్నటికి మొన్న కేంద్రం ఇచ్చిన మూడో విడత రైతు భరోసా నిధులను తానే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన జగన్…తాజాగా కేంద్రం వాటా, దాతలు, ఇతర సంస్థల ఆర్థిక సహాయ సహకారాలతో ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అది కాసేపు పక్కనబెడితే…ఆ వ్యవహారానికి ప్రచారం కల్పించేందుకు తమ సొంత పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించింది వైసీపీ సర్కార్.
జగన్ అట్టహాసంగ ప్రారంభించిన 144 పీఎస్ఏ యూనిట్లకు పెట్టిన ఖర్చులో సగం వాటా కేంద్రానిదే. ఆంధ్రప్రదేశ్‌కు కోవిడ్ కోటాలో రూ.649 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, కొన్ని ఆసుపత్రుల్లో పీఎస్ఏ యూనిట్లు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకుల ఏర్పాటుకు ఈ నిదులను ఉపయోగించారు. కానీ, కేంద్రం నిధులిచ్చిన సంగతి మచ్చుక్కయినా వేయని జగన్…అంతా తానే చేశానని బిల్డప్ ఇవ్వడం కొసమెరుపు.
ఇక, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు, వగైరా పరికరాలపైనా జగన్ తన పేరు వేయించుకున్నారు.
ఇక, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏర్పాటైన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటులో రాష్ట్ర పాత్రే లేదు. ఎస్బీఐ ఫౌండేషన్ సహకారంతో సీసీఎంబీ ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ క్రెడిట్ ను కూడా అన్న తన అకౌంట్లో వేసుకున్నారు.
ఇంత ఊదరగొట్టిన జగన్…ప్రభుత్వాసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీలకు కోట్లలో బిల్లులు పెండింగ్‌లో పెట్టిన విషయం మాత్రం మరిచారు. దీంతో, వారంలో పెండింగ్ బిల్లులు ఇవ్వకుంటే ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తామన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే…థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఏపీ ప్రజలకు తిప్పలు తప్పవు.