వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన జల్సా ఖరీదు 19 వేల కోట్ల రూపాయలు దాటి పోయిందట! ఆయన తిండి, ఇతరత్రా జల్సాలు కలిపి మొత్తం 19871 కోట్ల రూపాయలుగా లెక్క తేలిందట! ఈ నిధులతో అమరావతిలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయొచ్చట!! ఇదీ.. ఏపీ ప్రభుత్వం తేల్చిన లెక్క. జగన్ తన హయాంలో విచ్చలవిడిగా సొమ్ములు కరిగించేశారని పేర్కొంది. వీటిలో జగన్ తిన్న ఎగ్ పఫ్‌ల కోసమే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మంత్రిగొట్టిపాటి రవి చెప్పుకొచ్చారు. ఇక, దుబారా ఖర్చులకు మరిన్ని కోట్లు తగలేశారని అన్నారు.
ప్రతి విషయాన్ని ప్రచారం చేసుకున్నారని.. తన అనుకూల మీడియాకు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచి పెట్టారని మంత్రి తెలిపా రు. ఇది మరో 16 వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ సలహాదారులకు ఉచితంగా అనేకాలు కట్టబెట్టార ని తెలిపారు. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచే జరిగిందన్నారు. “15 కిలో మీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వినియోగించా రు. దీనికి అక్షరాలా 20 లక్షల రూపాయలు చెల్లించారు. భద్రత పేరుతో మరింత ఖర్చు చేశారు. ఇది జల్సా కాదా? 12-30 కిలో మీటర్ల దూరం వరకు కాన్వాయ్‌లో వెళ్లొచ్చు. కానీ, జగన్ మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ పెట్టుకున్నారు“ అని మంత్రి గొట్టిపాటి విమర్శించారు.
ఇక, అప్పుల రూపంలో తెచ్చిన సొమ్ముకు కూడా లెక్కలు లేకుండా పోయిందన్నారు. దీంతో సర్కారుకు ఇప్పుడు ఆ లెక్కలు తీయడం తలకు మించిన భారంగా మారిందన్నారు. ఏడాది 70 కోట్ల రూపాయలను వడ్డీలు, అసలు రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని మంత్రి చెప్పారు. పోనీ.. కడదామన్నా.. ఆ సొమ్మును అభివృద్ధికి ఖర్చు చేయలేదన్నారు. కేవలం జల్సాలు.. తన తిండి, తన పరివారాన్ని పోషించుకునేందుకు వాడుకున్నారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.
“ప్రజల సొమ్ముతో తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టూ ఇనుప కంచె నిర్మించుకున్నారు. బ్రిటీష్ వారి కాలంలో కూడా.. ఎవరూ ఇలా నిర్మించుకోలేదు. దీనికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ఏ పద్దులో చూపించారో తెలియదు. ఇక, తాడేపల్లిలో రెన్యువేషన్ పేరుతో ఏడాదికి రెండు సార్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మార్పులు చేశారు. ఇదంతా కూడా ప్రజాధనమే. ఇప్పటి వరకు చూసిన లెక్కల ప్రకారం 19 వేల కోట్లు జల్సాలకు ఖర్చు పెట్టారు“ అని గొట్టిపాటి రవి చెప్పుకొచ్చారు.