రాష్ట్రంలో వైసీపీ రివర్స్ పాలనకు రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత చూసి సీఎం జగన్కు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. వైసీపీపై తిరుగుబాటు మెుదలైందని..,’క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు సూచించారు. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న చంద్రబాబు.. చోడవరం నుంచే వైసీపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంతవరకు ఎవరికీ ఉద్యోగాలు రావని చంద్రబాబు అన్నారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకురావట్లేదని చెప్పారు. ‘ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా’ పేరుతో మలి విడత జిల్లాల పర్యటన ప్రారంభించిన చంద్రబాబు…అనకాపల్లిలో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో పాల్గొన్నారు. టీడీపీ హయాంలో రూ.లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు.
వైసీపీ మాత్రం రూ.5 వేల జీతం వచ్చే వాలంటీర్ పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఈ రోజుల్లో కూలీ పని చేస్తే నెలకు కనీసం రూ.15 వేలు వేతనం వస్తుందని ఎద్దేవా చేశారు. నిరంకుశత్వ పాలనతో ప్రజలను పీడిస్తున్న జగన్ను.. శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. వైసీపీ హయాంలో జే బ్రాండ్ తీసుకువచ్చారని.., మద్యంలో జగన్కు నేరుగా వాటా వెళ్తోందని విమర్శించారు.
“రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఆడబిడ్డల పాత్ర ముఖ్యం. జిల్లాల్లో మహానాడుకు శ్రీకారం చుట్టాం. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చోడవరం నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. మహానాడు నిర్వహించకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. వైసీపీ హయాంలో ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. చోడవరం నుంచి వైసీపీ పతనం ప్రారంభమైంది“ అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో తిరుగుబాటుకు సమయం వచ్చిందని చంద్రబాబు అన్నారు. రివర్స్ పాలనలో రివర్స్ ట్రీట్మెంట్ ఇచ్చే రోజు దగ్గర్లో ఉందని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలపై దాడులు చేశారని మండిపడ్డారు. ఎన్ని ప్రాణాలు పోయినా వైసీపీ నేతల్ని వదిలిపెట్టబోమని అన్నారు. ప్రతి ఒక్క ప్రాణం వైసీపీ అరాచకవాదుల మెడకు ఉరితాడుగా మారుతుందని చంద్రబాబు హెచ్చరించారు.