గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ పై దాడి చేసిన శ్రీను వైసీపీ కార్యకర్త అని, ఆ దాడి వైసీపీనే చేయించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఆ తర్వాత ఆ ఘటన సింపతీ కొట్టేసిన జగన్…సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని కోర్టు కరాఖండిగా కొద్ది రోజుల క్రితం తేల్చి చెప్పేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ను ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదని నిందితుడి తరఫున న్యాయవాది ప్రశ్నించారు. జగన్ స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది తెలిపారు. కానీ, ఆ స్టేట్ మెంట్ రికార్డు విషయం చార్జిషీట్ లో ఎందుకు ప్రస్తావించలేదని కోర్టు ప్రశ్నించింది.
బాధితుడిని విచారణ జరపకుండా మిగతా సాక్షులను విచారణ జరిపి ఉపయోగం ఏంటని కోర్టు ప్రశ్నించింది. బాధితుడు జగన్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించింది. కానీ, జగన్ కోర్టుకు హాజరు కాలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 10వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ ను రెండోసారి ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. జగన్ తో పాటు ఆయన పీఏ నాగేశ్వరరెడ్డి కూడా విచారణకు రావాలని స్పష్టం చేసింది.
ఈ క్రమంలోనే నేడు విచారణకు జగన్ గైర్హాజరు కావడం సంచలనం రేపింది. ఈ రోజు జరిగిన విచారణకు నిందితుడు శ్రీనివాస్ హాజరయ్యాడు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపు కోరారు. దీంతో, జగన్ తరపున ఆయన పీఏ కె నాగేశ్వరరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.