మక్కుముఖం తెలీనోడు.. పొరపాటుగానో.. ఆవేశంతోనే అమ్మ.. నాన్న ప్రస్తావన నోటి మాటలతో తీసుకొస్తే అప్పటివరకు సర్దిచెప్పేటోడు సైతం చెలరేగిపోతారు.తమ తల్లిదండ్రుల్ని ఉద్దేశించి ఒక్క మాట అన్నా అస్సలు ఊరుకోరు. ఒకమాటకు పది మాటలు అన్న తర్వాత మనసు ప్రశాంతమవుతుంది.
అలాంటిది వైఎస్ లాంటి మహానేతకు కొడుకుగా.. ఆయన రాజకీయ వారసత్వానికి నిలువెత్తు రూపంగా నిలవటమే కాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఆయన పుణ్యంగా వచ్చినప్పుడు… తండ్రికి ఇచ్చే మర్యాద.. గౌరవంలో పైసా వంతు తేడా వచ్చినా.. బస్తీమే సవాల్ అనేస్తారు తప్పించి.. అన్నోడిని వదిలేయరు.
ఒకవైపు తన తండ్రిని.. మరోవైపు రాష్ట్ర నేతల్ని.. నాయకత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఉపేక్షించటం ఏమవుతుంది? ఏమని సంకేతాలు ఇచ్చినట్లు ఉంటుంది? మిగిలిన నదీ జలాల సంగతి సరే.. క్రిష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ.. ఏపీల మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని.. లెక్కలు సరిగానే ఉన్నాయని చెబుతున్నారు.
తరచూ ఏపీ అక్రమ ప్రాజెక్టుల్ని నిర్మిస్తుందని చెప్పే కేసీఆర్ సంగతే చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు లేవన్నది మర్చిపోకూడదు. అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించటం లేదు?
తన తండ్రి గురించి మహానేతగా అభివర్ణించే జగన్.. అలాంటి నేతను ఉద్దేశించి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న వారి విషయంలో మౌనం వహించటం దేనికి నిదర్శనం? సీఎం జగన్ మాత్రమే కాదు ఆ పార్టీ నేతలు సైతం మాటలు రాని వారిగా ఎందుకు ఉంటున్నారు? చంద్రబాబు.. లోకేశ్ మీద అదే పనిగా విరుచుకుపడటమే కాదు.. రాయలేనంత ఘాటుగా మాట్లాడే కొడాలి నాని.. ప్రసన్నకుమార్ రెడ్డి.. ఇలాంటి ఎందరో ఇప్పుడు మౌన మనులు మాదిరి ఎందుకు ఉంటున్నారు?
నీటిదొంగ అని వైఎస్ ను అంటే.. సీఎం జగన్ ను గజదొంగ అన్నప్పుడు కూడా వైసీపీనేతలు మౌనంగా ఉండటం చూస్తే.. వారి విశ్వసనీయత మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. కారణాలు ఏమిటన్నది అర్థం కావట్లేదు కానీ.. కేసీఆర్ అండ్ కో అన్నేసి మాటలు అంటున్నా స్పందించకపోతున్న తీరు చూస్తే.. కొత్త సందేహాలు కలుగక మానవు. ఒకవేళ అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్న పక్షంలో అవన్నీ ప్రజల కోసమే తప్పించి.. మరెవరి కోసమో కాదు కదా?
అలాంటప్పుడు తమను ఎన్నుకున్న ప్రజల కోసంచేసే పనుల్ని సమర్థించుకోవాలి. అదే సమయంలో తమను దూషిస్తున్న వారి తప్పుల్ని ఎత్తి చూపాలి. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటాన్ని వైఎస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.