కొన్ని నిర్ణయాలను ప్రభుత్వం ఎందుకు తీసుకుంటోందో ఎవరకీ అర్థం కావడం లేదు. ఇలాంటి నిర్ణయాల్లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు కూడా ఒకటి. కృష్ణా బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తొందరలోనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. కృష్ణా బోర్డు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. బోర్డు విభజన తర్వాత ఏపీ ఏర్పాటు చేసుకోవాల్సిన బోర్డును వైజాగ్ లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.
ఇక్కడ విషయం ఏమిటంటే కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏర్పాటుకు వైజాగ్ ప్రాంతానికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే విశాఖపట్నం లేదా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కృష్ణానదికి ఏ విధంగాను సంబంధం లేదు. అందుకనే బోర్డును కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయమని ఉద్యమకారులు ఎప్పటినుండో డిమాండ్లు చేస్తున్నారు. ఉద్యమకారుల ఉద్దేశ్యం ఏమిటంటే బోర్డును రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో ఏర్పాటుచేయాలని.
ఎందుకంటే కృష్ణా నది నీరు రాష్ట్రంలోకి ప్రవేశించేది కర్నూలు జిల్లా నుండే. పైగా కృష్ణా జలాలకు ప్రాజెక్టుల రూపంలో ముఖ్యంగా రాయలసీమతోనే సంబంధముంది. కాబట్టే బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సరిపోతుందని ఉద్యమకారులు పదేపదే చెబుతున్నారు. నిజానికి బోర్డు విశాఖపట్నంలో ఏర్పాటు చేసినా కర్నూలులో ఏర్పాటు చేసినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ లేదు. బోర్డు రాజధానిలోనే ఉండాలని కూడా ఏమీ లేదు. వైజాగ్ ను జగన్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలని అనుకుంటున్నారు. అంతమాత్రాన బోర్డు వైజాగ్ లోనే ఉండాలని ఏమీ లేదు. ఇంత చిన్న విషయంపై ప్రభుత్వం ఎందుకంత మొండి పట్టుదలకు పోతోందో ఎవరికీ అర్ధం కావట్లేదు.
కర్నూలులోనే బోర్డు ఏర్పాటైతే వివాదాల పరిష్కారానికి అందరితో కూర్చుని మాట్లాడుకోవటానికి సులభంగా ఉంటుందన్నది ఉద్యమకారుల సూచన. రేపు వివాదాలు తలెత్తినపుడు బోర్డు ఉన్నతాధికారులు ప్రతిసారి వైజాగ్ నుండి కర్నూలు లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఉద్యమకారుల డిమాండ్ లో లాజిక్ ఉంది. మరి ప్రభుత్వం నిర్ణయంలో ఏమి లాజిక్కుందో అర్ధం కావటంలేదు. ఈ విషయాలన్నీ జగన్ కు తెలిసి జరుగుతున్నాయా తెలీకుండానే జరుగుతున్నాయా అన్నదే అర్ధంకావట్లేదు. ఏది ఏమైనా తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ పైనే ఉంటుంది. ఎందుకంటే రేపు ఏదైనా తేడావస్తే జనాలకు సమాధానం చెప్పాల్సింది జగనే కాబట్టి.