ఏపీలో వితంతువులు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తాము అధికంగా పెన్షన్ ఇస్తున్నామని వైసీపీ సర్కార్ గొప్పలు చె్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది అర్హులైన వారి పెన్షన్లు తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. తమ భర్తలు బ్రతికే ఉన్నా…చనిపోయారని కొంతమంది మహిళలు అబద్ధం చెప్పి వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని, అటువంటి వారి పెన్షన్లు తొలగించామని ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లి మరీ వాదించింది.
ఇక, ప్రతి ఏటా పెన్షన్ లు పెంచుకుంటూ………….పోతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్…ఒకసారి రూ.250 పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి పెన్షన్ రూ. 250 పెంచాలని, కానీ, అలా జరగడం లేదని జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వృద్ధాప్య పెన్షన్ దారులకు జగన్ షాకిచ్చారు. ఇకపై నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఉండవని, ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోకుంటే మురిగిపోయినట్లేనని చావుకబురు చల్లగా చెప్పారు.
అంతేకాదు, పెన్షన్ లపై తెచ్చిన కొత్త నిబంధన సెప్టెంబర్ 1నుంచి అమలు చేస్తున్నామని ముందస్తు ప్రకటన కూడా లేకుండా జనాలకు షాకిచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా నివామసముంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ సర్కార్ చెబుతోంది. వాస్తవానికి పెన్షన్ దారులు ఏదైనా కారణంతో ఆ నెల పెన్షన్ తీసుకోకుంటే…తర్వాతి నెలలో బకాయితో కలిపి పెన్షన్ ఇస్తున్నారు.
అయితే, కొందరు పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా నివాసముంటూ మూడు, నాలుగు నెలలకోసారి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో, వారికి చెక్ పెట్టేందుకే ఏనెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలని, బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు. అంతేకాదు, జూలై, ఆగస్టు నెలల్లో పెన్షన్ డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఆ రెండు బకాయిలను ప్రభుత్వం మంజూరు చేయలేదు.
కేవలం సెప్టెంబర్ నెల పెన్షన్ కు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏపీలో 60 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులుండగా..ప్రతి నెలా 2 లక్షల మందికి పైగా నెలనెలా పెన్షన్ తీసుకోవడం లేదు. దీంతో, పెన్షన్ తీసుకోని వారంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటున్నారని అధికారులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా ఇలా నిబంధనలు విధించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇలా చేయడం వల్ల నిజంగా ఏదైనా అనారోగ్య కారణాలతో వేరే రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నవారు తమ పెన్షన్ హక్కును కోల్పోవాల్సి వస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఈ కొత్త నిబంధనపై కనీసం మూడు నెలలు ప్రచారం చేసిన తర్వాత పెన్షన్ బకాయిలు నిలిపివేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇపుడు కొంతమంది కోసం విధించిన నిబంధన చాలామందికి ఇబ్బందిని కలిగిస్తోందని పలువురు పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.