కొంతకాలంగా సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య విభేదాలపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జులై 8న వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున అన్నాచెల్లెళ్లు కలుసుకోలేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ ను ఫిల్ చేసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నేడు వైఎస్ వర్థంతి సందర్భంగానైనా ఇద్దరినీ కలిపేందుకు విజయమ్మ మరోసారి ప్రయత్నిస్తున్నారని, వారిద్దరూ ఇడుపులపాయలో వైఎస్ వర్థంతి కార్యక్రమానికి హాజరవుతారని ప్రచారం జరిగింది.
ఆ సస్పెన్స్ కు తెరదించుతూ జగన్, షర్మిలలు ఇద్దరూ విజయమ్మ కోరిక ప్రకారం తన తండ్రి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించడం చర్చనీయాంశమైంది. అయితే, ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కూడా ఒకర్ని ఒకరు పలకరించకోకపోవడంపై చర్చ జరుగుతోంది. తాజా ఘటనతో వారి మధ్య విబేధాలకు ఫుల్స్టాప్ పడలేదని అనుకుంటున్నారు. తండ్రి వర్థంతి నాడు ఇద్దరూ మాట్లాడుకుంటారని ఆశించిన వైఎస్ అభిమానులకు భంగపాటు తప్పలేదు.
దీనికితోడు, వైఎస్ కు నివాళులు అర్పిస్తూ వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని.. అవమానాలెదురైనా ఎదురీదాలని.. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ’ అంటూ షర్మిల చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతోంది.
అన్న సీఎం అయినా…అందరూ ఉన్నా కూడా తాను ఒంటరిదానినేనని షర్మిల ట్వీట్ చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏపీలోనే జగన్ సముచిత స్థానం కల్పించి ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చేది కాదని, అన్న జగన్ ఉన్నా కూడా తాను ఒంటరిపోరాటం చేస్తున్నాననే భావన షర్మిలలో కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఒక్క ట్వీట్ తో జగన్, షర్మిలల మధ్య గ్యాప్ ఇంకా ఉందని స్పష్టమవుతోందని చర్చ జరుగుతోంది.
ఇక, తన తండ్రి వైఎస్ఆర్ కు నివాళులర్పించిన జగన్ ఆవేదనభరిత ట్వీట్ చేశారు. ‘నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.