వారంతా అత్యున్నతస్థాయి అధికారులు. కొందరు జిల్లాలను శాసించే అధికారులు అయితే.. మరికొందరు ఏకంగా రాష్ట్రాన్ని పాలించే అధికారులు. ఎక్కడికి వెళ్లినా.. రెడ్ కార్పెట్ స్వాగతాలు. ఎంతో గౌరవం.. అంతకు మించిన హోదా! ఇదీ.. దేశంలోఐఏఎస్లు, ఐపీఎస్‌ల గురించి అందరికీ తెలిసిన విషయం.
ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా అమలు చేయడమే కాకుండా.. వాటిలో లోపాలను కూడా ఎత్తి చూపడం వీరి బాధ్యత. కానీ, ఏపీలో మాత్రం వీరు డమ్మీలుగా మారుతున్నారు. ప్రభుత్వాధినేత ఏం చెబితే అది చేయాల్సిందే.. ఏం మాట్లాడితే అది వినాల్సిందే.
ఫలితంగా అత్యున్నతస్థాయి అధికారులు కోర్టు మెట్లు ఎక్కడమే కాదు.. ఇప్పుడు ఏకంగా జైలు శిక్షలకు కూడా గురయ్యే దారుణ పరిస్థితి జగనన్న ఏలుబడిలోనే దాపురించిందని ఉన్నతాధికారుల మధ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గతంలో చంద్రబాబు హయాంనే తీసుకుంటే.. ఆయన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి పనిచేయించుకున్నారనే వాదన ఉంటే ఉండి వచ్చు.. అది కూడా రాష్ట్రం కోసమే. కానీ, ఏనాడూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఏ ఒక్క అధికారినీ.. కోర్టులు తూలనాడిన రోజు కానీ, దండించిన రోజు కానీ.. మనకు కనిపించదు. ఇది విజన్ ఉన్న నాయకుడి పాలన తీరు.
కానీ, జగన్ పాలన ప్రారంభించి రెండేళ్లు మాత్రమే పూర్తయింది. కానీ, ఈ రెండేళ్ల కాలంలో అనేకానేక సంఘటనలకు సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారులు కోర్టుమెట్లు ఎక్కారు. బోనులో నిలబడ్డారు. ఇలా ఒకసారికాదు.. రెండు నుంచి మూడు సార్లు. ఇక, జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు కూడా ఇదే తరహాలో హైకోర్టుతో చీవాట్లు తిన్నారు. కోర్టు మెట్లెక్కి.. పరువు పోగొట్టుకున్నారు. దీనికి కారణం.. వివాదాస్పద నిర్ణయాలకు జై కొట్టడమే! అమలు చేయడమే! రాజ్యంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారంటూ.. అనేక మార్లు అధికారులపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
నీలంతో మొదలు..
నీలం సాహ్ని. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. గతంలో జగన్ సర్కారుకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకే కేసులో రెండు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై కోర్టు ఇచ్చిన ఆదేశాలకు మసిపూసి మారేడు కాయ చేయడంపై ధర్మాసనం సీరియస్ అయింది. దీంతో దేశంలోనే తొలిసారి ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు వెళ్లి సమాధానం చెప్పిన హిస్టరీని సొంతం చేసుకున్నారు.
డీజీపీ
డీజీపీ గౌతం సవాంగ్ విషయానికి వస్తే.. మూడు సార్లు హైకోర్టు మెట్లెక్కి బోనులో నిలబడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, తూర్పుగోదావరిలో ఓ లాయర్‌ను పోలీసులు అపహరించారన్న ఆరోపణలపై కోర్టు సీరియస్ అయి.. ఆయనను ఏకంగా మూడు సార్లు పిలిచింది. ఈ క్రమంలోనే ఒకసారి.. రూల్ ఆఫ్ లా.. అంటే.. ఏమిటో.. కోర్టులో స్వయంగా ఆ యనతో చదివించింది కూడా! ఇది కూడా దేశంలో ఎక్కడా ఇంతకు ముందు ఇలా జరగకపోవడం గమనార్హం. ఇదే కేసులో తూర్పుగోదావరి ఎస్పీ(ఐపీఎస్) ని కూడా కోర్టు పిలిచి చీవాట్లు పెట్టింది.
విశాఖ సీపీ
ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖలో పర్యటించేందుకు వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకున్నతీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏకంగా విశాఖ పోలీసు కమిషనర్(ఐపీఎస్)ను కోర్టుకు పిలిచి మందలించింది. ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారంటూ.. నిలదీసింది. మీరు రాజ్యాంగం చదువు కోకుండానే ఐపీఎస్ అయ్యారా? ముస్సోరిలో ఏమీ నేర్చుకోకుండానే బాధ్యతలు చేపట్టారా? అంటూ.. నిలదీసింది.
ఏకంగా జైలుకే!
36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి హై కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. విచారణకు అధికారులు ఇద్దరు వ్యక్తిగతంతా హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకు గాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది. సో.. ఇదీ మొత్తంగా జగనన్న పాలనలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు దుర్గతి.. అంటున్నారు పరిశీలకులు.