ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద పోరాటానికి తన రాజకీయ వ్యూహాలు, పరపతి, 21 మంది లోక్ సభ, మరియు 6గురు రాజ్యసభ ఎంపీలను, వారి పరపతిని వాడడానికి సిద్ధమయ్యారు జగన్. అన్ని పనులు మానుకుని అమిత్ షా, మోడీలను కలిశారు. తనకు ఈ సాయం చేసిపెట్టాలని అడిగారు. వారు ఎలా స్పందించారు అన్నది పక్కన పెడితే… మరోసారి ప్రధానిని, రాష్ట్రపతిని కలవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు.
తన సర్వశక్తులు ఒడ్డి ఎన్వీ రమణ పవర్ తొలగంచాలని జగన్ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు విజయం సాధిస్తారో తెలియదు. అయితే, ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం వాడుకుని ఓట్లు సంపాదించుకున్న జగన్ రెడ్డి…. జస్టిస్ ఎన్వీ రమణ మీద చేసిన పోరాటంలో పదో వంతు శ్రమను ఎందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పెట్టడం లేదు.
ప్రత్యేక హోదా అడగడానికి ఎందుకు అపాయింట్మెంట్లు కోరడం లేదు. ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమం చేపట్టడం లేదు. తనకు మెజారిటీ లేకున్నా పరపతిని వాడి ఒక సుప్రీంకోర్టు జడ్జిని దించాలని ప్రయత్నం చేస్తున్నపుడు అదే విశ్వాసం ప్రయత్నం రాష్ట్రానికి ఉపయోగపడే ప్రత్యేక హోదా కోసం జగన్ ఎందుకు చేయడం లేదు. ఢిల్లీలో ప్రతి ఒక్కరినీ కలిసి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగరు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు వైసీపీ కార్యకర్తలు మోడీ షాలను నిలదీయరు.
2 ఎంపీలున్న కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసి సాధించుకున్నపుడు కేంద్రంలో 28 మంది ఎంపీలున్న జగన్ రెడ్డి ఎందుకు ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా పోరాట స్ఫూర్తిని నింపడం లేదు. తనకు ఉపయోగం లేని ప్రత్యేక హోదా ఎందుకు అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా వస్తే తన స్కీములతో ప్రజలను ఆకట్టుకోవడం కష్టం అనుకుంటున్నారా? మరి ఏ కారణంతో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదు.
ఒక జడ్జిపై పోరాడటానికి తన శక్తులు సరిపోయినపుడు, దానికి ప్రజల మద్దతు దొరుకుతుందని నమ్మినపుడు రాష్ట్రం కోసం, ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ మద్దతు ఇచ్చేవారు కదా.