ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే హిందువుల మనోభావాల విషయంలో వివిధ వర్గాలకు టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన వరుస సంఘటనలతో ఇలాంటి అభిప్రాయం సదరు వర్గాల్లో కలిగింది. అయితే, తాజాగా ఓ మంత్రి చేసిన పని జగన్ సర్కారును ఇరుకున పడేసిందని అంటున్నారు. పవ్రితమైన విజయవాడ దుర్గగుడి అమ్మవారి ప్రాంగణలో వైసీపీ నేతల సమావేశం జరగడం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ సర్కారును సులభంగా టార్గెట్ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ దుర్గ గుడి కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దుర్గగుడి అమ్మవారి ఆలయమా? లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయ సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి తీరును తప్పుపట్టారు.
కాగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఈ ఎపిసోడ్‌పై ఫైర్ అయ్యారు. మంత్రి సెల్ నుంచే సమావేశానికి రావాల్సిందిగా ఎస్ఎంఎస్లు వెళ్లడంతో 64 మంది వైసీపీ అభ్యర్థులు వెళ్లారని మండిపడ్డారు. తక్షణమే మంత్రిని సస్పెండ్ చేయాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు… ఇప్పుడు వైసీపీ సమావేశాలు జరుగుతున్నాయని బొండా ఉమ ఆరోపించారు.
జనసేన నేత పోతిన మహేష్ సైతం ఈ పరిణామంపై మండిపడ్డారు. ఆలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమావేశానికి సహకరించిన ఈవో సురేష్ బాబు రాజీనామా చేసి వైసీపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. కరోనా లాక్డౌన్ నుంచి నిన్నటి సమావేశం వరకు అమ్మవారి ప్రసాదాలను వైసీపీ నేతలు, కార్పోరేటర్ అభ్యర్ధులకు దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు.కాగా, మంత్రి నిర్వహించిన సమావేశం సీఎం జగన్‌ను బుక్ చేసినట్లయిందని పలువురు చర్చించుకుంటున్నారు.