జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడో లోపం కనిపిస్తోంది. ప్రతి నిర్ణయంలో పొరపాటు, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లీగల్ ఇష్యూ రాకుండా నిర్ణయం తీసుకోవడం ఈ ప్రభుత్వానికి కష్ట సాధ్యంగా కనిపిస్తోంది. గడచిన ఏడాదిన్నరలో తీసుకున్న నిర్ణయాలను వదిలేస్తే తాజాగా తీసుకున్న నిర్ణయం ఒకటి పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కలకలం రేపుతోంది.
అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన సత్యనారాయణను తిరిగి అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా తీసుకోవటానికి రంగం సిద్ధమైపోయినట్లు సమాచారం. అసలు కార్యదర్శిగా ఉండటానికే సత్యనారాయణకు అర్హతలు లేవనే కేసు ఒకటి కోర్టులో నడుస్తోంది. ఇదే విషయమై అప్పట్లో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. సత్యనారాయణ మీద అనేక ఆర్ధికపరమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని అప్పట్లో గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ ప్రత్యేకంగా విచారణ జరిపించారు.
అతనిపై ఉన్న అనేక ఆరోపణల వల్ల తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం అయన్ను కార్యదర్శిగా నియమించడానికి అంగీకరించలేదు. పైగా అసెంబ్లీ సెక్రటరీగా ఉండాలంటే లా డిగ్రీ తప్పనిసరి. విద్యార్హతలపైనే అనేక వివాదాలకు తోడు లా డిగ్రీ కూడా లేని కారణంగా చంద్రబాబునాయుడు ఈ అధికారిని కేవలం ఇన్చార్జిగానే కంటిన్యు చేశారు.
ఇదే సమయంలో సత్యనారాయణ టీడీపీతో అత్యంత సన్నిహితునిగా మెలిగారు అని వైసీపీ ఆరోపించింది. అయితే… చివరకి శేఖర్ రెడ్డి ఎపిసోడ్ లాగే ఇది కూడా టర్న్ అయ్యింది. ఎందుకంటే… గత ప్రభుత్వంతో అధికారపార్టీలో వారితో సన్నిహితంగా మెలగాడని ఆరోపణలు చేసిన వైసీపీ ఇపుడు ఆయన్ను ముద్దాడుతోంది. సత్యనారాయణ అక్రమాలు, విద్యార్హతల్లాంటి వాటిపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెద్ద పోరాటమే చేశారు. గవర్నర్ కు ఫిర్యాదులు చేయటమే కాకుండా విచారణ చేయించటం, కోర్టులో విచారణ జరిపించటంలో కూడా ఆళ్ళ పోరాటం చేశారు.
అన్ని ఆరోపణలు చేసిన వివాదాస్పదమైన అధికారిని ఇపుడు తామే అందలం ఎక్కిస్తుంది. ఆయనను అసెంబ్లీ స్పెషల్ సెక్రటరీ గా నియమించటానికి రంగం రెడీ అయిపోయిందట. ఎవరు సిఫారుసు చేశారో తెలీదు కానీ ఈయన నియామకానికి శాసనవ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనికి సంబందించిన ఫైలు ప్రస్తుతం జగన్ దగ్గరకు చేరిందట.
తాను అధికారంలో ఉండగా వైసీపీని ముప్పుతిప్పలు పెట్టిన అధికారిని ఇపుడు వైసీపీ ప్రభుత్వమే నెత్తికెక్కించుకుంటోందన్న విషయం పార్టీతో పాటు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని జగన్ తోనే తేల్చుకోవాలని కొందర ఎంఎల్ఏలు గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఏమి తేలుతుందనేది సస్పెన్సుగా మారింది.