తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేయడం.. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్ర యించడం.. ఆ వెంటనే దీనిపై కోర్టునాలుగు వారాలపాటు స్టే ఇవ్వడం.. అంతా కూడా జరిగిపోయాయి. కానీ, ఇక్కడ కొన్ని ప్రశ్నలు మాత్రం సశేషంగా మిగిలిపోయాయి. అవేంటంటే.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయ దుంధుభి మోగించింది. మరి ఇంత పెద్ద క్రెడిట్‌కు ప్రచారం కల్పించుకోవాలి కదా?!
కానీ, అలా చేయకుండా.. ఫలితాలు వెలువడి.. ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. చంద్ర బాబుపై సీఐడీ కేసుతో విరుచుకుపడడం వెనుక వ్యూహం ఏంటి? ఎందుకు ఇలా చేశారు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తారట్లాడుతున్న ప్రధాన ప్రశ్న. వాస్తవానికి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నా.. ఆయనను విచారించాలన్నా.. ఇప్పటికిప్పుడు చేయాల్సిన అవసరం లేదు. దీనికి కొంత సమయం తీసు కుని.. ఇప్పుడు వచ్చిన స్థానిక ఫలితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ, జగన్ అండ్ కోలు అలా చేయలేదు. వెనువెంటనే.. అంటే.. టీడీపీ ఓటమి నుంచి కోలుకోకుండానే బద్నాం చేసే ప్రక్రియకు తెరదీశారు.
మరి జగన్ ఊరికేనే ఇలా చేశారా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. పక్కా వ్యూహంతోనే టీడీపీ పై `ఆపరేషన్ సీఐడీ` చేపట్టారని గుసగుస వినిపిస్తుండడం గమనార్హం. ఒకటి.. స్థానికంలో దెబ్బతిన్న టీడీపీని నైతికంగా దెబ్బకొట్టే వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. అధినేత చంద్రబాబుపైనే కేసు నమోదైతే.. మిగిలిన కేడర్ అంతా కూడా నిస్తేజంలోకి వెళ్లిపోతుందని.. తద్వారా పార్టీ నుంచి వలసలు పుంజుకునే ఛాన్స్ ఉంటుందని జగన్ అండ్ కో ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు.
అదేసమయంలో తిరుపతి ఉప ఎన్నికలోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించాలంటే.. ప్రశ్నించే గొంతును అణిచేయడమే కర్తవ్యంగా ముందుకు సాగారని తెలుస్తోంది. ఈ రెండు వ్యూహాలకు తోడుగా.. జంపింగులను ప్రోత్సహించి.. టీడీపీని అణిచవేయాలనే ఒక కుట్ర పూరితమైన.. వ్యవహారం కూడా ఉందని అంటున్నారు.
ఒకవేళ.. ఇప్పుడు బాబు స్టే తెచ్చుకున్నారు కనుక.. దీనినే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేది కూడా వైసీపీకి ఉన్న మరో వ్యూహంగా కనిపిస్తోంది. స్టేలు తెచ్చుకోవడం బాబుకు అలవాటేనని.. ప్రచారం చేసుకునేందుకు.. రాజధానిలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారని చెప్పడం ద్వారా తిరుపతిలో ఎస్సీ ఓటు బ్యాంకును తమవైపునకు తిప్పుకొనేందుకు కూడా జగన్ అండ్ కో వేసిన ఎత్తుగడగానే భావించాలని మేధావివర్గం చెబుతుండడం గమనార్హం.