ఒకప్పడు వార్తా పత్రికల్లో ఏదైనా తప్పిదం చోటు చేసుకుంటే.. ఖండన వేయడానికి అభ్యంతరం ఉండేది కాదు. ముందు వేసిన వార్తకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. ఖండనకు కూడా అలాంటి ప్రాధాన్యమే ఇచ్చేవాళ్లు. అలా చేయడం చాలా హుందాగా ఉంటుంది కూడా. కానీ ఇప్పుడు ఆ విలువలను ఏమాత్రం పాటిస్తున్నారన్నది సందేహమే.
చాలా వరకు పత్రికల్లో మొదటి పేజీ వార్తలో ఏదైనా తప్పు చోటు చేసుకుంటే.. దాని ఖండనను తీసుకెళ్లి లోపలి పేజీల్లో కనిపించీ కనిపించకుండా వేయడం జరుగుతోంది. ఇందుకు దాదాపు ఏ పత్రికా మినహాయింపు కాదు. తాము చేసిన తప్పు పెద్దది అయినపుడు, అది జనాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నపుడు కచ్చితంగా ఖండన ప్రముఖంగానే వచ్చేలా చూడాలి. కానీ సాక్షి పత్రిక అలా చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలోనూ వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఐతే వర్షాలకు అమరావతి మొత్తం మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైకాపా వర్గాలు గట్టి ప్రచారం చేస్తున్నాయి. మార్ఫ్డ్ ఫొటోలు, ఇక్కడివి కాని ఫొటోలు పెట్టి అమరావతి మునిగిపోయింది చూశారా, చంద్రబాబు ఇలాంటి చోట రాజధాని కావాలంటున్నాడు అని కౌంటర్లు వేస్తున్నారు.
అందులో ఒక ఫొటో అయితే మరీ దారుణం. ప్రస్తుతం హైకోర్టు ఉన్న ప్రాంతమంతా చెరువును తలపిస్తున్నట్లుగా ఉందా ఫొటో. దాన్ని సాక్షి పత్రిక బుధవారం ఎడిషన్లో ప్రముఖంగా పబ్లిష్ చేసింది. హైకోర్టు ఉన్న ప్రాంతం మునిగిపోయిందని పేర్కొంది. కనీసం వెరిఫై చేసుకోకుండా వేసిన ఆ ఫొటో ఫేక్ అని తేలింది. సోషల్ మీడియా జనాలు దీన్ని బయటపెట్టేశారు. సాక్షిని తిట్టిపోస్తున్నారు.
దీంతో ఈ రోజు ఖండన వేసింది సాక్షి పత్రిక. కానీ అదెక్కడో లోపలి పేజీల్లో చిన్నగా ఇచ్చారు. అందులో వివరణ కూడా సరిగా లేదు. దీంతో మరోసారి నెటిజన్లు సాక్షి చేసిన పనిని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.