- ప్రధానికి అభ్యర్థనలు అసత్యం
- అమితషాకు వినతులు అబద్ధం..
- జగన్ ఢిల్లీ వెళ్లేది స్వప్రయోజనాల కోసమే
- పార్లమెంటు సాక్షిగా వాస్తవాలు బట్టబయలు
సీఎం జగన్మోహన్రెడ్డి నెలలో ఒకసారైనా ఢిల్లీ వెళ్తున్నారు.. ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమితషాలతో ఏకాంతంగా చర్చిస్తున్నారు.. ప్రత్యేక హోదా నుంచి పోలవరం దాకా.. విభజన హామీల నుంచి అదనపు నిధుల వరకు.. అన్నీ అడిగేస్తున్నారని సీఎం కార్యాలయం లీకులిస్తుంటుంది.. లేదంటే మీడియాకు ప్రకటనలు విడుదల చేస్తుంటుంది.
లోపల ఏం జరిగిందో ఆయనో, ప్రధానో, షానో చెబితే తప్ప బాహ్య ప్రపంచానికి తెలియదు! ఈ పరిస్థితిని జగన్ తనకు అనుకూలంగా మలుచుకుని.. వారికి ఏవేవో వినతిపత్రాలు అందజేశానంటూ అవాస్తవాలు చెబుతున్నారు.
నిజానికి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతున్న తన కేసుల గురించి.. ఇతరత్రా స్వప్రయోజనాల గురించి మాత్రమే చర్చలు జరుపుతున్నారని దీని ద్వారా రూఢి అవుతోందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ఢిల్లీ వెళ్తే.. జగన్ పోలవరం అంచనా వ్యయం ఆమోదం గురించీ అడగడంలేదు. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపుపైనా వినతి పత్రాలు ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తడం లేదు. కానీ అలా అడిగానని.. ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి వినతిపత్రాలు ఇచ్చానని మీడియాకు లీకులు ఇస్తున్నారు.
హైకోర్టు తరలింపు గురించి ముఖ్యమంత్రి జగన్.. అమితషాకు కొత్తగా ఎలాంటి వినతిపత్రం ఇవ్వలేదని ఇదివరకే వెల్లడైంది. నిరుడు డిసెంబరు 16న, ఈ ఏడాది జనవరి 19న ఢిల్లీకి వెళ్లినప్పుడు కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్రానికి వినతిపత్రాలు సమర్పించినట్లుగా మీడియాకు సమాచారమిచ్చారు.
‘హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చాలని 2020 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదన అందింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గత నెల 4వ తేదీన స్పష్టం చేశారు.
కానీ ‘నోటిఫికేషన్ జారీ కోసం వినతిపత్రం’ అంటూ జగన్ నానా హడావుడి చేశారు. తాజాగా… పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలు ఆమోదించి, ఆమేరకు నిధులు ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరనే లేదని తేలింది.
రాజ్యసభలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా బదులిస్తూ ఈ విషయం చెప్పారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.55,650 కోట్లను ఆమోదించాలని ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించినట్లుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు’ అని స్పష్టం చేశారు.
నిజంగా వినతిపత్రం ఇస్తే అది ఆయా శాఖల్లో రికార్డు అవుతుంది. రికార్డు కాలేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రే చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిధుల మంజూరు ప్రక్రియ సంక్లిష్టంగా ఉందని.. రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసే నిధులను పీపీఏ, కేంద్ర జల సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేస్తోందని.. ఆ నిధులను నాబార్డు నుంచి రుణం రూపంలో తీసుకుని.. పీపీఏకి జమచేస్తోందని.. ఆ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖకు బదిలీ అవుతున్నాయని.. ఇదంతా సుదీర్ఘ ప్రక్రియని.. దీనికంటే నాబార్డు ద్వారా నేరుగా తమ ఖాతాలో వేయాలని.. లేదంటే రూ.10 వేల కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని జగన్ షాను కోరినట్లు అప్పట్లో మీడియాకు సమాచారమిచ్చారు. ఇదంతా అబద్ధమేనని రుజువైంది.
వారిద్దరే చాలు..!
వాస్తవానికి జగన్ మోదీ, షాలను తప్ప జగన్ ఇతరులను కలవరు. పోలవరంపై జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావతను గానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను గానీ కలవాలంటే ఆయనకు నామోషీ.
తనది మోదీ, షా స్థాయిగా భావిస్తుంటారని.. వారు ఓకే అంటేనే ఏ పనైనా జరుగుతుందని.. అందుచేత మిగతా మంత్రులను కలవడం వృథా అనుకుంటారని వైసీపీ వర్గాలు అంతర్గతంగా చెబుతుంటాయి.
షెకావతును కలిసినా మొక్కుబడిగానేనని ఆయన శరీర భాష చెప్పకనే చెబుతుంటుందని.. అందుకే ఆయన రాష్ట్ర మంత్రులకు, అధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వడమే మానేశారని తెలుస్తోంది. పైస్థాయిలో ఉన్నవారికి అభ్యర్థన చేసేటప్పుడు అణకువ అవసరమని పెద్దలు చెబుతారందుకే.
ఈ లెక్కన ప్రత్యేక హోదా గురించి కూడా ఆయన వినతిపత్రం అందించారనేది కూడా అవాస్తవమే అయి ఉంటుందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.
టూర్లు ఇందుకేనా..?
జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పులివెందులలో తన స్వగృహంలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే.
మొదట ఆయన గుండెపోటుతో చనిపోయారని జగన్ మీడియాలో ప్రసారమైంది. తీరా ఈయన పులివెందుల వెళ్లాక సీన్ మారిపోయింది. టీడీపీ నేతలపై హత్యారోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
3 సిట్లు వేసినా దోషులెవరో తేలలేదు. దీంతో వివేకా కుమార్తె హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అడ్డదిడ్డంగా ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. చివరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
అంతే.. జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లారు. మోదీని కలిశారు. సీబీఐ బృందం పులివెందుల రావడానికి ఆరు నెలలు పట్టింది. కొందరిని విచారించినా.. కేసు రికార్డులను ఇంతవరకు స్థానిక పోలీసు స్టేషన్ సీబీఐకి అప్పగించలేదు. హైకోర్టు ఆదేశించినా ఇంకా సీబీఐకి రికార్డులు చేరలేదు.
స్థానిక కోర్టులో దీనిపై విచారణ సా…గుతోంది. ఇదే గాక కరోనా మాస్కులు లేవన్న పాపానికి నర్సీపట్నం వైద్యుడు సుధాకర్‌ను సస్పెండ్ చేయడం, నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో ఆయన్ను చావబాది.. పిచ్చివాడన్న ముద్రవేసి.. పిచ్చాస్పత్రిలో చేర్చడం.. హైకోర్టు జోక్యంతో ఆయన విడుదల కావడం.. చివరకు ఈ ఉదంతాన్ని కూడా కోర్టు సీబీఐకివ్వడం తెలిసిందే.
దీంతో కొందరు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి కక్ష పెంచుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణను వేగిరం చేయాలని జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించగానే.. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఊపందుకుంది.
ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది కూడా. అంతే.. జగన్ హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. శతవిధాలుగా ప్రయత్నించినా.. మోదీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అమితషా కాసేపు మాట్లాడి పంపించారు. ఆ తర్వాత ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సాయంతో జస్టిస్ రమణపై ఆరోపణలు గుప్పిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు అమరావతి భూకుంభకోణాల్లో ఉన్నారని, దర్యాప్తు జరిపించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ రాశారు.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తున్నారంటూ నాటి హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరిపైన, జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిపైన ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందో ఏమో.. కొన్నాళ్లకే జస్టిస్ మహేశ్వరి త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడి చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఇక్కడకు వచ్చారు.
మూడు రాజధానులపై హైకోర్టు విచారణ మందగించింది. సీబీఐ కోర్టులోనూ కేసుల విచారణ ఉధృతంగా జరగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనలపై విపక్షాలు అప్పట్లోనే అనుమానాలు వ్యక్తంచేశాయి.
కేసుల మాఫీ కోసమే మోదీని, అమితషాను కలుస్తున్నారని ఆరోపించాయు. ఇప్పుడు పార్లమెంటులో కేంద్ర మంత్రుల సమాధానాలతో ఈ ఆరోపణలు నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది.
రాజీనామాలు ఇప్పుడు చేయరేం?
విశాఖ ఉక్కు కర్మాగారం.. ప్రైవేటీకరణ ప్రమాదంలో చిక్కుకుంది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న సీఎం జగన్.. రాష్ట్రంలో (కేంద్ర) ప్రభుత్వ రంగంలో ఉన్న ఒకే ఒక్క భారీ పరిశ్రమ కనుమరుగవుతుంటే ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమంటూ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లూ ఆయన ఊరూవాడా తిరిగి చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హోదాను సాధించలేకపోతున్నారని.. ప్రధాని మోదీ మెడలు వంచలేకపోతున్నారని నాడు ఆరోపించారు.
కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ వైదొలిగి.. ఎంపీ పదవులకు రాజీనామా చేస్తేనే వస్తుందన్నారు. తన పార్టీ లోక్‌సభ సభ్యులతో మాత్రం రాజీనామా చేయించారు. కానీ వైసీపీ ఎన్నికల్లో గెలిచాక.. అధికారం చేపట్టకముందే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడే.. బీజేపీకి భారీ మెజారిటీ వచ్చినందున హోదాపై కేంద్రానికి విజ్ఞప్తులు చేయడం మినహా గత్యంతరం లేదని చెప్పడంతో జనం విస్తుపోయారు.
వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులను సంపద సృష్టి కోసం కాకుండా సంక్షేమానికంటూ ఖర్చుపెడుతున్నారు. చివరకు ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలివ్వడానికి కూడా కటకటలాడుతున్నారు.
రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. కొత్తగా ఒక్క పరిశ్రమా పెట్టలేని పరిస్థితి. ఈ సంక్షోభ పరిస్థితిలో రాష్ట్రంలోని ఏకైక పెద్ద పరిశ్రమ అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించడంతో.. రాష్ట్ర యువతలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో కేంద్రాన్ని నిలదీయడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. కేవలం విశాఖ ఎన్నికల కోసమే ప్రధానికి ఓ లేఖ రాసి సరిపెట్టారని అనుకుంటోంది.
ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నూటికి నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణ జరిపి తీరతామని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో రాష్ట్రం భగ్గుమంది. జగన్, మోదీ ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ జనం ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. ఇంకోవైపు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలపడం.. జగన్ తీరును తప్పుబట్టేలా చేసింది.
జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టాక తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మైత్రిని కొనసాగిస్తున్నారు. ఏనాడూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై టీఆర్ఎస్ స్పందించలేదు. కానీ తొలిసారిగా విశాఖ ఉక్కుపై కేసీఆర్ తనయుడైన కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
అవసరమైతే విశాఖ వెళ్లి ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కార్మికులు, అఖిలపక్షం చేస్తున్న ఆందోళనలకూ, పోరాటానికి మద్దతిస్తానని ప్రకటించారు. దీనిపై కార్మిక సంఘాలు కూడా హర్షం వ్యక్తంచేశాయి. ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు.
పొరుగు రాష్ట్రం విశాఖ ఉక్కుకు మద్దతు పలుకుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుంది. రాష్ట్రం నుంచి వైసీపీ తరఫున గెలిచిన 22 మంది లోక్‌సభ సభ్యులు.. ఆరుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ గతంలో చెప్పినట్లు రాజీనామాల ద్వారానే కేంద్రంపై ఒత్తిడి పెంచగలమని అంటున్నారు.