సీఎం జగన్ పాలనలో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని, అందుకే అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిలో టిడిపి నేతలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్తలు, ఎన్నారైలు స్థలాలు కొన్నారని వైసీపీ నేతలు, జగన్ ఆరోపిస్తున్నారు. అది అమరావతి కాదని కమ్మరావతి అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై మాజీ హోంమంత్రి, సీనియర్ పొలిటిషన్ వసంత నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ క్యాబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదని వసంత నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రివర్గ కూర్పులో కమ్మ కులానికి ప్రాతినిధ్యం లేకపోవడం దురదృష్టకరమని ఆయన కామెంట్స్ చేశారు. ఈ చర్యలను బట్టి కమ్మ సామాజిక వర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నట్టు కనిపిస్తుందని బాహాటంగానే తన ఆవేదనను వెళ్లగక్కారు. 35 శాతం మంది కమ్మ సామాజిక ఓటర్లు వైసీపీని ఆదరించారని ఆయన గుర్తు చేశారు.
కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఆ సామాజిక వర్గానికి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గ నేతకు కేబినెట్లో ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని గుర్తు చేశారు. వైఎస్సార్ అన్ని సామాజిక వర్గాలను గౌరవించే వారని, 2004లో తాను ఓడిపోయినా ఆప్కాబ్ చైర్మన్ గా నియమించారని, ఆయన క్యాబినెట్లో ఇద్దరు కమ్మ నేతలకు చోటు కల్పించారని గుర్తు చేశారు. తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ కు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని టాక్ వస్తోంది.