ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ పూర్తయిన సంగతి తెలిసిందే. జగన్ ఎంత హడావిడిగా ఢిల్లీ వెళ్లారో అంతే హడావిడిగా వెనక్కి వచ్చేశారు. ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో భేటీ అయిన జగన్ మమ అనిపించేసి వెనక్కి వచ్చేశారు. ఎప్పటిలాగే రొటీన్ గా పోలవరం నిధులు, పునరావాసానికి సంబంధించిన నిధులు, విద్యుత్ కు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వంటి విషయాలే మాట్లాడారని అధికారులు ఓ ప్రకటన విడుదల చేసేశారు.
కానీ, మోడీతో జగన్ భేటీ 40 నిమిషాలపాటు జరిగింది. ఈ భేటీలో వారిద్దరి మధ్య వైసీపీకి, జగన్ కు సంబంధించిన పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే జగన్ తన కేసుల వ్యవహారంపై కూడా మోడీతో చర్చించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ టూర్ పూర్తిగా జగన్ వ్యక్తిగతం అని రాష్ట్ర ప్రజలకు సంబంధించినది కాదని తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతేకాదు, ఇటీవల వైసీపీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన షాకింగ్ కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఆ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. ఇక, కొంతకాలంగా వైసీపీపై బీజేపీ పెద్దలు రాష్ట్ర బీజేపీ నేతలు ఒక స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో బీజేపీతో వైసీపీ కటీఫ్ చెప్పబోతోందని, టీడీపీతో బీజేపీ జతకట్టబోతుందని ప్రచారం జరుగుతోంది.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆ విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చిందట. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో పొత్తు, మద్దతుల గురించి, రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు గురించి మోడీతో జగన్ మాట్లాడారని తెలుస్తోంది. ఇక, ప్రధానితో జగన్ మీటింగ్ తర్వాత విజయసాయిరెడ్డి కామెంట్లు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు వారి వ్యక్తిగతమని వి.సా రెడ్డి అన్నారు. ఇక, ఢిల్లీ టూర్ లో జగన్ కు ఏపీ అప్పులపై మోడీ క్లాస్ పీకారని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది.