కొద్ది రోజులుగా ఏపీలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ విపక్ష టీడీపీ నతేలు మొదలు కార్మిక సంఘాలు, సామాన్యుల వరకు రకరకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలకు తాము కూడా మద్దతు తెలుపుతున్నామంటూ వైసీపీ నేతలు కూడా మొక్కుబడి ప్రకటనలిస్తున్నారు. ఇక, తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత హంగామా జరుగుతుంటే….సీఎం జగన్ మాత్రం…ప్రధాని మోడీకి ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు.
దీనికితోడు విశాఖ ఉక్కును పోక్సో కంపెనీకి బేరం పెట్టింది జగన్ అని, గత ఏడాది అక్టోబరులో పోక్సో ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఆ భేటీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంలో మార్పు లేకుంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామన్నారు.
స్టీల్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఉద్యమించాలని ప్రతినిధులను జగన్ కోరారు. పొస్కోను వైజాగ్ లో అడుగుపెట్టనివ్వబోనని జగన్ అన్నారు. గత ఏడాది పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమని జగన్ అంగీకరించారు. అయితే, ఆ భేటీ విశాఖ ఉక్కు కర్మాగారంలో పోస్కో ఫ్యాక్టరీ పెట్టేందకు కాదని, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని వారికి సూచించానని జగన్ అన్నారు. ప్లాంటు ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామని ప్రభుత్వం తరఫున చెప్పానని వివరించారు. అదీ కుదరకపోతే భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల దగ్గర స్టీల్‌ప్లాంట్ పెట్టమని వారికి సూచించానని జగన్ తెలిపారు.