రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జగన్ సర్కారును ముప్పేట ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతి మూడు మాసాలకు ఒక సమ స్య తెరమీదికి వస్తూనే ఉంది. కొన్ని నెలల కిందట.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారిపై పోలీసులు దాడులు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో టీడీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుతో టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయడం, జాతీయ ఎస్సీ కమిషనన్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ సమయంలో తీవ్ర విమర్శలకు గురైన ప్రభుత్వం.. వెంటనే దీని నుంచి తప్పించుకు నేందుకు.. వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఎస్సీలకు పదవులు ఇస్తున్నాం.. అంటూ.. కొందరికి పదవులు ఇచ్చి.. ఆ సెగ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
తర్వాత పరిణామాల్లో బీసీలపై దాడులు జరిగాయి. రాష్ట్రంలో ఈ విషయం కూడా కలకలం రేపింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలపై కేసులు నమోదు చేయడం అప్పట్లో ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన జగన్ ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు తెరదీసింది. ఈ క్రమంలోనే భారీ ఎత్తున బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామంటూ.. ప్రకటించడం, దరిమిలా 134 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు తెలిసిందే. ఫలితంగా బీసీల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు ప్రయత్నించింది. ఐతే అవి పవర్ ఉన్న పదవులు కాకపోవడం వల్ల బీసీలు పెద్దగా గుర్తించలేదు.
ఇక, ఇప్పుడు మరో చిక్కులో పడిన జగన్ సర్కారు.. ఇంటా.. బయటా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మెజారిటీగా ఉన్న హిందూ సామాజిక వర్గానికి చెందిన ఆలయాలపై దాడులు.. జగన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా అంతర్వేది రథం దగ్ధం, కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన రథం సింహాలు మాయం కావడం, తాజాగా రామతీర్థం ఘటన.. ప్రభుత్వానికి భారీ సెగ తగిలించాయి.
దీనిపై అటు బీజేపీ-జనసేన కూటమి నుంచి ఇటు టీడీపీ వరకు అన్ని పక్షాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయం పక్కన పెడితే.. ఈ పరిణామాలు వరుసగా జరగడం, ప్రభుత్వం తరఫున వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు సాగకపోవడం మరింతగా సర్కారును ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో ఈ వేడిని తట్టుకునేందుకు మరోసారి జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా ఆయన విజయవాడలోని దుర్గమ్మ గుడి సహా.. అప్పట్లో కనకదుర్గ ఫ్లైవోర్ నిర్మాణం నేపథ్యంలో తొలగించిన చిన్నపాటి ఆలయాల పునర్నిర్మాణం కోసం.. ఆయన శంకుస్థాపన చేశారు. ఫలితంగా జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి కాదు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి పంపేందుకు వ్యూహాత్మకంగానే స్కెచ్ గీశారు. ఐతే ఇవి శాస్త్రోక్తంగా జరగకపోవడం వల్ల సూన్యమాసం లో చేయడం వల్ల హిందువులని మరోసారి కించ పరిచినట్టు ఐంది.
అయితే.. గతంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించారో.. అలానే ఇప్పుడు కూడా అడుగులు వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఎన్నాళ్లు చేస్తారనేది సామాన్యుల మాట. ప్రస్తుతానికి ప్రభుత్వం హిందూవర్గానికి అనుకూలమనే సంకేతాలు పంపినా.. కీలకమైన అంతర్వేది, రామతీర్థం ఘటనల విషయంలో దోషులను పట్టుకోగలిగితేనే ప్రభుత్వం పారదర్శకత తెలుస్తుందని అంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.