ఏపీ సీఎం జగన్ మరి కావాలని చేస్తున్నారో.. లేక తెలియక చేస్తున్నారో.. ఇవన్నీకాకుండా.. ఆయనను ఎవ రైనా నడిపిస్తున్నారో తెలియదు కానీ.. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయా అంశాలు కోర్టుల్లో ఉన్నాయనే విషయాన్ని కూడా ఆయన విస్మరిస్తున్నట్టుగా ఉంటున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం కోర్టులో ఉండగా.. స్వయంగా సీఎం జోక్యం చేసుకుని 2020లో మంటలు రేపారు.
ఆయనను తప్పించేందుకు అప్పటికప్పుడు జీవో తీసుకువచ్చి.. తమిళనాడు కు చెందిన మాజీ న్యాయ మూర్తిని తీసుకువచ్చి పట్టాభిషేకం చేశారు. దీంతో కోర్టు నిప్పులు చెరిగింది. ఇలాంటి అనేక కీలక అంశా లు ఉన్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా.. రాజధానివిషయాన్ని కెలికేశారు. రాజధానిగా అమరావతిని కొనసా గించాలని కోరుతూ.. రైతులు.. ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారికి అనుకూలంగా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.
రైతులకు ఫ్లాట్లు ఇవ్వడం, మౌలిక సదుపాయాల వరకు అన్నీ కల్పించాలని.. దీనికి ఆరుమాసాలే గడువ ని కూడా తేల్చి చెప్పింది. అయితే.. దీనిని రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇప్పటికే ఒక విడత సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రాజధాని మార్చాలని కానీ, మూడు రాజదానులకు తాము అనుకూలం అని కానీ.. ఎక్కడా సుప్రీం కోర్టు చెప్పలేదు. కేవలం సమయాన్ని మాత్రం పెంచింది.
పైగా.. మంగళవారం.. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి చేపట్టింది. ఇది ఒకవైపు సుప్రీకోర్టులో విచారణ దశలో ఉండగానే.. జగన్ ఇలా రాజధానిని విశాఖకు తరలిస్తామని.. చెప్పడం, తాను కూడా విశాఖకు వెళ్లిపోతానని అనడం.. సంచలనంగా మారింది. అదేసమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం.. ఎందుకంటే.. రాజధాని కేసు విషయంపై సుప్రీంలో విచారణ జరుగుతున్న సమయంలో దీనిని ప్రభావితం చేసేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.