ఇదంతా సీఎం కాన్వాయ్ కు సంబంధించిన రగడ.. ఇంకా చెప్పాలంటే సర్కారు వారి కారుకు సంబంధించిన గోల.. లేదా ఘోష. సీఎం జగన్ ను అనుసరిచంచే కాన్వాయ్ వాహనాలకు సంబంధించిన రగడ. నిధులు లేక రేపటి వేళ తాము ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లా పర్యటలనకు వెహికల్ ను ప్రొవైడ్ చేయలేమని తేల్చి చెప్పేసింది రవాణా శాఖ. ఆ వివాదం ఈ వివరంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వివాదాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రవాణా శాఖ ఈ సారి వివాదంలోకి రావడం, ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని వాదులాట దిగడం ఇప్పుడొక చర్చనీయాంశం. ఇప్పటిదాకా ఈ తరహా బిల్లులు 17.5కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని అంటున్నారు రవాణా శాఖ వర్గాలు. దీనిపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలిక.
వాస్తవానికి సీఎం కాన్వాయ్ కు వెహికల్స్ లేకనే మొన్నామధ్య ప్రకాశంలో ఓ భక్తుడి వెహికల్ తీసుకుని, తరువాత వివాదాల్లో ఇరుకున్నారు. అదేవిధంగా పలు చోట్ల ప్రయివేటు వాహనాలు అద్దె ప్రాతిపదికన తీసుకోవడమో లేదా మరొక ప్రత్యామ్నాయం వెతుక్కోవడమో చేస్తుంటారు. అయితే ఇక్కడ మూడేళ్లుగా బకాయిలు మాత్రం ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ఏం చేయాలో తోచక ఇకపై సీఎం భద్రత కు సంబంధించి కానీ ఇతర అవసరాలకు కానీ కావాల్సిన రీతిలో జిల్లాల పర్యటనల్లో వెహికల్స్ ఇవ్వలేమని తేల్చడంతో మరో వివాదం మరింత రాజుకోనుంది.
ఇప్పటిదాకా ఓ లెక్క ఇక నుంచి ఓ లెక్క అని సీఎం అంటున్నారు. అంటే జిల్లాల పర్యటనలు అన్నవి ఇకపై మరింతగా జరగనున్నాయి. ఒంగోలులో చోటు చేసుకున్న ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేందుకు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి పెద్దలు మళ్లీ మళ్లీ సంబంధిత బాధిత వర్గాలకు క్షమాపణలు చెప్పే అవకాశమే రాకుండా ఉండేందుకు అధికారులు ఆ రోజు ముందస్తు చర్యలు తీసుకున్న మాదిరిగానే ఇకపై తీసుకోవాలి. కానీ ఇందుకు ఏటా నాలుగున్నర కోట్ల రూపాయలు ఖజానా నుంచి కేటాయించాలని లెక్క తేలింది.
అసలే అరకొర నిధులతో ఆర్థిక స్థితి బాగుండకపోయినా నెట్టుకు వస్తున్న సర్కారుకు
రవాణా శాఖ చెప్పిన కబురు ఓ విధంగా చేదు వార్తే ! ఏదేమయినప్పటికీ జిల్లాలలో కూడా మంత్రుల కాన్వాయ్ కు కూడా లోటన్నది లేకుండా ఎవరి జాగ్రత్తలో వారు ఉంటున్నా సీఎం స్థాయి వ్యక్తి మాత్రం తన సొంత జేబు డబ్బులు వెచ్చించాల్సిన పని లేకున్నా అసలు తన భద్రతకు సంబంధించి ఎంత మొత్తం అవుతుందో ఓ అంచనా కు వచ్చి నిధులు సర్దుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించని సర్కారు కు ఇకపై కారు బయానా ఓ భారం కానుందా ?