టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గం సింహాద్రిపురం చేరుకుంది. ఇక్కడ పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ పై లోకేష్ విమర్శలతో విరుచుకుపడ్డారు.
జగన్ ది బటన్ ప్రభుత్వం కాదని బఫూన్ ప్రభుత్వం అని లోకేష్ చురకలంటించారు. అప్పుచేసి సంక్షేమం చేయడం గొప్ప కాదని, అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలని అన్నారు. చివరకు అప్పిచ్చేవాడు లేక జగన్ బటన్ నొక్కిన డబ్బులు పడడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం మోపి ఇదే సంక్షేమం అంటున్నారని జగన్ సర్కార్ ను దుయ్యబట్టారు. 9 సార్లు కరెంటు చార్జీలు, 3 సార్లు ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను పెంచేసి ప్రజల రక్తం తాగుతున్నాడని జగన్ పై నిప్పులు చెరిగారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఏపీ పరువు జగన్ తీశాడని, పంచాయతీలకు రావాల్సిన నిధులు కాజేశారని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల గౌరవాన్ని నిలబెడతామని హామీ ఇచ్చారు. తాను జగన్ లాగా ముఖ్యమంత్రిని కాల్చాలి, చెప్పుతో కొట్టాలి, రోడ్డు మీద కాల్చేయాలి అనలేదని లోకేష్ అన్నారు. జగన్ చేసే సైకో పనులు చూసి తట్టుకోలేక ఆయనను సైకో అనడం తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమీ చేయలేదన్నారు. తనను చూస్తే జగన్ కు ప్యాంటు తడుస్తుందని, అందుకే తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.