ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మళ్లీ ఫైరయ్యారు. “జగన్.. నువ్వు.. ఈ రాష్ట్రంలోని చిన్నారులతో మంచి మామ అనిపించుకుంటావో.. లేక కంసమామ అనిపించుకుంటావో.. నీ ఇష్టం. నువ్వే నిర్ణయించుకో!“ అని సవాల్ విసిరారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన లోకేష్.. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో ప్రభుత్వ ఉదాసీనతపై నిప్పులు చెరిగారు. కరోనానియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా.. మరింత వ్యాప్తికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
విజయనగరం ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన లోపంతో ఇద్దరు రోగులు చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నా.. ఇంకా ఎక్కువ మందే చనిపోయారని ప్రచారం జరుగుతోందని, దీనిలో నిజాలు ఏంటో బయటకు చెప్పాలని లోకేష్.. సీఎం జగన్ ను నిలదీశారు.
ఇక, కరోనా ఇంత తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా.. జగన్.. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష లు నిర్వహిస్తానని మొండిపట్టుదలకు పోతున్న వైనం పిల్లల్లోతీవ్ర ఆందోళన కలిగిస్తోందని లోకేష్ చెప్పారు. దేశంలోని 20 రాష్ట్రా ల్లో ఈ పరీక్షలు రద్దు చేసినా.. జగన్ మాత్రం పెడతానంటూ.. చిన్నారుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని దుయ్యబట్టారు.
“కరోనా వేళ… విద్యార్థులకు పరీక్షలు పెట్టి.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడతారా?“ అని లోకేష్ ప్రశ్నించారు. తక్షణమే ఆయా పరీక్షలు వాయిదా వేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అదేసమయంలో ఆయా అంశాలను పేర్కొంటూ.. గవర్నర్ విశ్వభూషణ్ కు కూడా లోకేష్ లేఖ రాశారు.
రాష్ట్రంలో 16.3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. రెండోదశలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యం లో వీరి పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. పరీక్షలకు సంబంధించి తాను విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీసుకున్న అభిప్రాయాలతో కూడిన 1778 పేజీలతో కూడిన నివేదికను గవర్నర్కు పంపించారు లోకేష్.
కోవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని.. లేదా రద్దు చేయాలని.. ఆయన గవర్నర్ను అభ్యర్థించారు. తాను న్యాయ నిపుణులతోనూ సంప్రదించానని, ఇంత పెద్ద కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం.. పట్టుదలకు పోయి పరీక్షలు పెడుతోందని.. ఇలా నిర్వహించేందుకు ఉన్న ఒక్క కారణం కూడా చూపించలేక పోతోందని.. లోకేష్ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదని లోకేష్ తెలిపారు. దీనిపై తమదైన పంథాలో యుద్ధం చేస్తున్నామని.. ప్రభుత్వానికి విన్నవించామని, గవర్నర్కు లేఖ రాశామని.. ఇక్కడ కూడా విద్యార్థులకు న్యాయం చేయలేక పోతే.. హైకోర్టును ఆశ్రయించి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని.. లోకేష్ చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్పై లోకేష్ బాగానే యుద్ధం చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు.