సామర్లకోటలో సభ సందర్భంగా చంద్రబాబు, పవన్ లపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, ఒకటి లోకల్, ఇంకొకటి నేషనల్, మరొకటి ఇంటర్నేషనల్…తర్వాత ఎక్కడో తెలీదు అంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ఏపీపై ప్రేమ లేదని, అందుకే హైదరాబాద్ లో ఇంట్లోనే ఉంటున్నారని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్ప జగన్ చేసిన అభివృద్ధి శూన్యం అని లోకేష్ ఎద్దేవా చేశారు. తన హయాంలో సీఎంగా జగన్ చేసిన మంచి పని ఒక్కటీ లేదని విమర్శించారు. అసలే సైకో అయిన జగన్ కు అధికార మదం ఎక్కిందని, ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ లపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరినట్లు కనిపిస్తోందని సెటైర్లు వేశారు.
లోటు బడ్జెట్ తో ఏర్పడిన నవ్యాంధ్రను ఏ లోటూ లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారా? అని లోకేష్ విమర్శించారు. పిచ్చి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి 73 ఏళ్ల చంద్రబాబును నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని ఆరోపించారు.