వైసీపీ అధినేత, సీఎం జగన్ ఇటీవల కాలంలో చేస్తున్న పేదలు వర్సెస్ పెత్తందారుల మధ్యే వచ్చే ఎన్నిక ల్లో పోటీ ఉంటుందన్న కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా జగన్ పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పేదలకు మేలు చేసేందుకు 4 సంవత్సరాలు పనిచేసి ఉంటే.. ఈమాటలు వచ్చేవి కాదన్నారు. పేదలను సెంటిమెంటుగా చూపిస్తూ.. పబ్బం గడుపు తున్నారని వ్యాఖ్యానించారు.
‘‘పేదలకు పెత్తందార్లకు మధ్య పోరాటమా..?, రాయల సీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఎవరు ఆపేవారు. అందుకే కదా ప్రజలు నీకు ఆ సీటు అప్పగించారు. అప్పుడు పేదలకు మేలు జరిగేది కదా..? నినాదాలు ఎవరైనా చేస్తారు. కానీ, పనులు చేసేవారు కావాలి. స్లోగన్లు వద్దు.. ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క స్లోగన్లు ఇస్తారా..? ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేసి కూడా అనవసరం“` అని వ్యాఖ్యానించారు.
తెలుగు దేశం పార్టీ మళ్లీ అఅధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణంపై టైమ్ బాండ్ ప్రోగ్రాం(సమయం పెట్టుకుని కార్యక్రమం పూర్తి చేయడం) పెట్టుకుని పని చేస్తాం. జగన్ కిమ్ తమ్ముడు. నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారు అని చంద్రబాబు సటైర్లు వేశారు. ఇది చెత్త ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
“బటన్ నొక్కితే అమ్మఒడి వస్తుందా..?, రూ. 13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి రూ. 5 వేలు వేస్తారా..?, జగన్ నొక్కేది ఉత్తుత్తి బటనే. అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతారు’’ అని చంద్రబాబు అన్నారు. తాడేపల్లి ముఠాకు రోజులు దగ్గర పడ్డాయని.. వారికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు.