టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు పుట్టపర్తిలో దిగ్విజయంగా 50వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జగన్ పాలనపై లోకేష్ నిప్పులు చెరిగారు. ఓబులదేవచెరువులో మూసిఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ వద్ద లోకేష్ సెల్ఫీ దిగి కీలక వ్యాఖ్యలు చేశారు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట…అన్నట్టుంది మన జగన్ రెడ్డి చేపల బజార్ల తీరు అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. బులుగు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఫిష్ ఆంధ్రా దుకాణాల నిర్వహణలో లేదని లోకేష్ చురకలంటించారు.
మూసి ఉన్న ఫిష్ ఆంధ్ర మార్ట్ జగన్ రెడ్డి పనితనానికి నిదర్శనం అని, ఆ మార్ట్ కాన్సెప్ట్ శాశ్వతంగా ఫినిష్ అయినట్టేనని లోకేష్ పంచ్ లు వేశారు. చంద్రబాబు దెబ్బకు జగన్ గిలగలా కొట్టుకుంటున్నారని విమర్శించారు. యువగళం దెబ్బ అదుర్స్ కదా జగన్ రెడ్డీ… అంటూ చురకలంటించారు. స్టూడెంట్ లీడర్ నుంచి సీఎంగా ఎదిగిన చంద్రబాబు ముందు టెన్త్ ఫెయిల్ అయిన జగన్ కుప్పిగంతులు వేశాడని, లాగిపెట్టి ఒకటి కొడితే కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయం ముందు నువ్వెంత జగన్… నువ్వు అమూల్ బేబీ అంటూ సెటైర్లు వేశారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్ ని నమ్మడం లేదని, ఎమ్మెల్యేలు కూడా జగన్ ని నమ్మలేదని ఈ ఎన్నిక ద్వారా తేలిందని విమర్శించారు. జగన్ మోహన్ కాదు మోళీ మోహన్ అని నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపితమైందని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ లో నిన్న ఎన్ని టీవీలు పగిలాయో, అహంకారంతో వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు… ఏకంగా ప్రజలు గుండు కొట్టించి పంపేశారంటూ లోకేష్ చురకలంటించారు.
జగన్ వద్ద రెండు బటన్స్ ఉంటాయి… ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద రివర్స్ బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు జగన్ ఖాతాలోకి వెళ్లిపోతాయి అని లోకేష్ ఎద్దేవా చేశారు.