విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు, పలు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. అయితే, ఈ దీక్ష వల్ల టీడీపీ నేతలకు పేరు రావడం జీర్ణించుకోలేని వైసీపీ సర్కార్….మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమంలోనే నేడు విశాఖలో పర్యటించిన చంద్రబాబు…పల్లా శ్రీనివాస్ ను పరామర్శించి…బహిరంగ సభలో ప్రసంగించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి తన దీక్షతో పల్లా శ్రీనివాస్ ఊపిరి పోశారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తుంటే జగన్ పబ్జీ ఆడుకుంటున్నావా? అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు విశాఖను దోచుకోవాలనుకుంటున్నారని, స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని మండిపడ్డారు. విశాఖ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేరే రాష్ట్రాలకు తరలివెళుతున్నాయని, మీరు పాలకులా? కమీషన్ ఏజెంట్లా? అని ప్రశ్నించారు.
విశాఖ ఆత్మను అమ్మితే మీరు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే మీరు అంగీకరిస్తారా? విశాఖ ఉక్కుపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు. నోరు పడిపోయిందా? అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం తన ప్రాణం అని, అందర్నీ అడిగే అమరావతి ప్రకటించానని చంద్రబాబు అన్నారు. విజయసాయిరెడ్డి అంతు చూస్తామని, ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ అని దుయ్యబట్టారు.
రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం జగన్ విశాఖకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అందరూ నన్ను నువ్వు చేతగానివాడివి… తిట్టలేవు అని అంటారు…. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి అక్కడికి ఇక్కడికి పిచ్చి కుక్క మాదిరి తిరుగుతూనే ఉంటాడని.. రేపు పాదయాత్ర పేరుతో వస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు.
‘‘ఎవడికి కావాలి నీ పాదయాత్ర.. పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లి పడుకో.. కల్లబొల్లి మాటలు కట్టిపెట్టు. అన్నీ ప్రయత్నాలు చేస్తాం.. పట్టువిడుపులు ఉండాలంటూ.. హితోపదేశం చేశాడు. స్టీల్ ప్లాంట్‌పై ఏం జరగనుందో మనకు ముందుగానే సూచించాడు. చెవిలో పువ్వు పెట్టాలని చూడకు విజయసాయి. బట్టలిప్పిస్తాం. అంతుచూస్తాం. రాష్ట్రానికి మూడు సార్లు పోస్కో ప్రతినిధులు వచ్చారు. వారితో వీళ్లు ఫొటోలు కూడా దిగారు. ఒప్పందంపై రాజ్యసభలో కేంద్రం మంత్రి స్వయంగా చెప్పారు. ఈ ఏ2 ఏం చేస్తున్నాడు? దొంగనాటకాలు ఆడారు. అమ్మేద్దామని.. విశాఖను చుట్టేయాలన్నది పథకం. పల్లా శ్రీనివాస్ ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే బాధ్యత లేదా… సమాజం కోసం, విశాఖ అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే… పట్టించుకోరా? వెనకబడిన వర్గం అని వదిలేశారా? దొంగ సాధువు ఉన్నాడు ఇక్కడే… రేపు వచ్చి నంగి నంగి మొక్కుతాడు’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో జగన్, విజయసాయిలపై విమర్శలు గుప్పించారు.
కాగా, కుప్పం నియోజకవర్గంలో అలజడి సృష్టించడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ పరిస్థితిపై ఎస్ఈసీకి ఆయన లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కుందామని, టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురి కావద్దని చంద్రబాబు కోరారు.
ఓటమి మనస్తాపంతో అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు పోలీసులే బెదిరింపులకు దిగడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. కడప జిల్లా నంద్యాలపల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్ధి భర్తని తప్పుడు కేసుల్లో ఇరికించడం హేయమన్నారు.