ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు..జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. జంగారెడ్డిగూడెంలో బీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన చంద్రబాబు…వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2014 రిజల్ట్ రిపీట్ అవుతుందని జగన్ కు భయం పట్టుకుందని, వైసీపీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. పొట్ట కొట్టుడు-బటన్ నొక్కుడు.. ఇదే జగన్ స్టైల్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజలను, ప్రతిపక్షాలను పోలీసులతో బెదిరించడం, పరదాల మాటున టూర్లు వేయడం జగన్ కు పరిపాటి అని సెటైర్లు వేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను కొట్టించి జగన్ పైశాచిక ఆనందం పొందారని ఆయన చురకలంటించారు. ఎవరైనా చనిపోయారంటే సైకో నవ్వులు నవ్వుతుంటావని జగన్ పై సెటైర్లు వేశారు. భయపడితే చంపేస్తారని, స్వాతంత్య్ర యోధుల్లా పోరాడాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు, బీసీ నేతలకు పిలుపునిచ్చారు.
టీడీపీ కార్యకర్తలు, నేతల మీద కేసులు పెడితే తానున్నానని, బాధపెట్టే వాళ్లను వదలనబోనని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటిదాకా తన మంచితనమే చూశారని, ఇక తన కఠినత్వం చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉంది కదా అని ఎన్టీఆర్ పేరు మారుస్తారా?.. అని నిలదీశారు. తాను తల్చుకుంటే కడప పేరు మార్చగలనని, కానీ, తనకు సంస్కారం ఉందని, బీసీలు రాజకీయంగా ఎదగాలని అన్నారు.
పాత పథకాలకు జగన్ పేర్లు పెట్టినంత మాత్రాన అవి ఆయన సొంత పథకాలు అయిపోవని ఎద్దేవా చేశారు. . దీనిని బట్టి చెప్పేయొచ్చు నీ మనస్తత్వం ఏమిటో’ అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో యాత్రలు చేశానని, కానీ, ఏలూరు నుంచి చింతలపూడికి వచ్చేసరికి ఈ ఉయ్యాల రోడ్ల దెబ్బకు తనకు నడుం నొప్పి వచ్చేసిందని పంచ్ లు వేశారు. ఇవన్నీ భరిస్తున్న జనం సహనానికి జోహార్లు అని అన్నారు. జగన్ మందు తాగి 29 మంది చనిపోయారని, జనం మందు తాగుతున్నారా.. విషం తాగుతున్నారా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు.