ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు రెండు, మూడు రోడ్ షోలతో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాగళం సభలో జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ కు ఉన్న కొత్త వ్యాధి గురించి చంద్రబాబు వివరించారు. జగన్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నాడని, ఆయనది నార్సీ విధానమని జగన్ ను అధ్యయనం చేసిన డాక్టర్ చెప్పారని ఆరోపించారు.
ఆ డిజార్డర్ తో బాధపడే వాళ్లు చెప్పింది మనం చేయాలని, ఎదురు తిరిగితే దాడి చేసి చంపేస్తారని, అదే నార్సీ విధానం అని చంద్రబాబు వివరించారు. చరిత్రలో హిట్లర్, బిన్ లాడెన్, ఆఫ్ఘన్ తాలిబన్లు, ఉత్తర కొరియా అధినేత కిమ్ ల తర్వాత ఈ నార్సీ విధానంతో బాధపుడుతున్న ఐదో వ్యక్తి కిమ్ తాత జిమ్ జగన్ అని సెటైర్లు వేశారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పడం, అందరినీ మోసం చేయడం, ఎదురుతిరిగితే నరికేయడం ఈ వ్యాధి లక్షణాలని చురకలంటించారు. సొంత తల్లిని చూసుకోనివాడు ప్రజలను చూసుకుంటాడా? చెల్లికి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వని సైకో రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఏం చేస్తాడు అని ప్రశ్నించారు. చెల్లెలి చీరల గురించి మాట్లాడడం నార్సీ విధానం అని చెప్పారు.
ఈ వ్యాధి ఉన్నవారు తమ తండ్రిని ప్రేమించరని, తమ పిల్లలను ప్రేమించరని, తమను తాము కూడా ప్రేమించరని… తాము చెప్పింది జరగాలన్నదే వీళ్ల మనస్తత్వం అని అన్నారు. ఒక ఎంపీ (రఘురామ) తిరగబడ్డాడని అతడిపై సీఐడీ కేసులు పెట్టి, పోలీస్ కస్టడీలో కొట్టించి ఆనందించిన సైకో అని మండిపడ్డారు. నడిరాత్రి వచ్చి తనను అరెస్టు చేశారని, తనకే దిక్కులేకపోతే ప్రజలకు దిక్కుందా? అర్థమైందా నార్సీ విధానం! అని అన్నారు.
ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్న జగన్.. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని 3 ముక్కలాటకు తెరలేపడం నార్సీ విధానం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడని, దారిలో చెట్టు నరికేశాడని, చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం, ప్రజలను చూస్తే భయం! ఇప్పుడు పరదాలు తీసేసి ఓట్ల కోసం వస్తున్నాడు అంటూ దుయ్యబట్టారు.