టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనపర్తి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. అనపర్తి వస్తున్న చంద్రబాబు కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకోవడం, పోలీసులే రోడ్డుపై బైఠాయించడం సంచలనం రేపింది. చంద్రబాబు కాన్వాయ్ కి పోలీస్ అడ్డుపెట్టి మరి ఆయన పర్యటనను అడ్డుకోవడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు సంఘీభావంగా చుట్టుపక్కల బలబద్రపురం చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనతో జగన్ పై మండిపడ్డ చంద్రబాబు…పోలీసులకు తాను సహాయ నిరాకరణ చేస్తున్నానని ప్రకటించారు.
ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎవరో సైకో చెప్పారని తనను ఆపేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మహాత్మా గాంధీ హయాంలో 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం ఏర్పడిందని, ఆ తర్వాత అది దండియాత్రగా మారి బ్రిటిష్ పాలన పతనానికి నాంది పలికిందని చంద్రబాబు గుర్తు చేశారు. అదే తరహాలో ఈ ఘటన జగన్ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతోందని అన్నారు.
ఎంతమందిపై కేసులు పెడతారో తానూ చూస్తానని చంద్రబాబు హెచ్చరించారు. ఆ సైకోని కూడా పోలీసులు రక్షించలేరని, ఈరోజు ప్రజా ఉద్యమానికి తాను నాంది పలుకుతున్నానని చంద్రబాబు అన్నారు. ఇది పోలీసు రాజ్యం కాదు రౌడీ రాజ్యం అని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు కాన్వాయ్ కు అనుమతినివ్వకపోవడంతో కాలినడకన ఆయన అనపర్తి వెళ్లారు. ఈ క్రమంలోనే అనపర్తి రోడ్లన్నీ భారీ జన సందోహంతో పసుపుమయమయ్యాయి.
ఆ తర్వాత కూడా చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే జవహర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ జవహర్ ను నేలపైనే కూర్చోబెట్టి ఆయనను అవమానించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ హయాంలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. దళితులకు కుర్చీలో కూచ్చొనే అర్హత లేదా అని నిలదీశారు. జగన్ గుమ్మం దగ్గరే దళితులు నిల్చోవాలని, ఇంతకన్నా అవమానం మరోటి లేదని దుయ్యబట్టారు.