నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం…ప్రపంచమంతా మహిళల గొప్పతనం గురించి చర్చించుకుంటున్న శుభ దినం…మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ…అంటూ జనం మహిళామణులను కీర్తిస్తున్న తరుణం…అతివలంటే అబలలు కాదు ఆది పరాశక్తులంటూ ప్రశంసిస్తున్న సందర్భం…ఈ రకంగా నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా పలువురు మహిళలను సన్మానిస్తుంటే…ఇదే రోజున భూమాతను కొలిచే భరతభూమిలో…అందులోనూ మా తెలుగు తల్లికి అంటూ కీర్తించే తెలుగునాట మహిళలకు ఘోర అవమానం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలకు వరాలు ప్రకటిస్తున్నామని చెబుతోన్న సీఎం జగన్…మరోవైపు అమరావతి మహిళా రైతులను అవమానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
బెజవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలని అమరావతి మహిళా రైతులు సంకల్పించారు. ప్రకాశం బ్యారేజీపై అమరావతి మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఈ విషయం తెలిసిన పోలీసులు తెల్లవారుజామునుంచే తనిఖీలు చేపట్టారు. బ్యారేజిపై మహిళా రైతులను అడ్డుకొని మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు.
దీంతో, సేవ్ అమరావతి అంటూ తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో అమరావతి రైతులంతా నినాదాలు చేస్తూ వందలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు, రాయపూడి నుంచి మందడం వైపు వస్తున్న మహిళలను రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంతో ….మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతపట్టుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మరోవైపు, రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ అమరావతి రైతులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. బ్యారేజ్ వద్ద తమను పోలీసులు వ్యాన్లో ఎక్కించి ఎక్కడకు తీసుకువెళుతున్నారో అర్థం కాలేదని, కొందరిని మంగళగిరి పీఎస్లో 3 గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెం వద్ద వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని వాపోయారు.
447 రోజుల ఉద్యమంపై జగన్ స్పందించలేదని, మహిళ దినోత్సవం రోజు నిరసన తెలుపుతున్న మహిళలకు జగన్ మంచి గౌరవం ఇచ్చారని మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.