దేశ రాజధాని ఢిల్లీ కావొచ్చు. అధ్యాత్మిక కేంద్రం తిరుమల కావొచ్చు. ప్రాంతం ఏదైనా సరే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి ఆయన నిరూపించారు. కరోనా వేళ.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ముఖానికి మాస్కులు పెట్టుకోవటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మీకు దగ్గరగా ఉండే వారికి మీ కారణంగా.. అవతలి వారి కారణంగా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. అందరూ మాస్కులు పెట్టుకోవటం తప్పనిసరి అన్న మాట చెబుతారు.
దీనికి భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖానికి మాస్కు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా.. తన వద్దకు ఎవరొచ్చినా ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఎక్కడిదాకానో ఎందుకు? తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకున్న జగన్ కు స్వాగతం పలికేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వచ్చారు. వారిలో ఒక మహిళా నేత.. ఆమె భర్త జగన్ వద్దకు వచ్చి.. ఆయనతో ఫోటో దిగేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
అందుకు ఓకే చెప్పిన జగన్.. ఫోటోకు ఫోజిచ్చారు. అయితే.. ఆ ఇరువురు నేతలు ముఖానికి మాస్కులు పెట్టుకోవటంతో.. అది అవసరమా? అన్నట్లుగా జగన్ నోటి నుంచి మాట రావటం.. వెంటనే నవ్వేసిన సదరు నేత ముఖానికి మాస్కు తీసేసి.. ఫోటో దిగారు. ఇక్కడే కాదు.. తిరుమలలోని ఏ సందర్భంలోనూ జగన్ ముఖానికి మాస్కు పెట్టుకున్నది లేదు. ఆయన చుట్టు ఉన్న వారు.. సెక్యురిటీ సిబ్బంది.. టీటీడీ అధికారులు అందరూ ముఖానికి మాస్కు ధరిస్తే.. జగన్ మాత్రం అందరికి భిన్నంగా మాస్కు పెట్టుకోకుండా ఉండటం అందరిని ఆకర్షించింది.