సంక్షేమ పథకాలు.. ఈ దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా తాము అమలు చేస్తున్నామని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. తాజాగా కూడా ఆయన 700 కోట్ల మేరకు విద్యాదీవెన పథకానికి నిధులు కుమ్మరించారు. అయితే.. ఇవేవీ ఇప్పుడు ఆశించిన మేరకు ఫలితాన్ని ఇచ్చేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పథకాల కింద లబ్ధి పొందిన కుటుంబాలు కూడా ఉన్నాయి.
వారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే సీఎం జగన్కు, ఆయన పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థు లకు అనుకూలంగా ఓటేశారు. మరి మిగిలిన 75 శాతం మంది కూడా.. అభివృద్ధిని కోరుకుంటున్నారనేది పరిశీలకుల మాట. అంతేకాదు.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తే.. ఎక్కువ మంది కి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. నిజానికి కొందరు కడుతున్న పన్నులను మరికొందరికి గుండుగుత్తగా పంచడాన్ని మెజారి టీ ప్రజలు అంగీకరించడం లేదు.
అందుకే.. వైసీపీపై వ్యతిరేకత వస్తోందన్నది వాస్తవం. అదేసమయంలో చెత్తపన్ను.. సహా.. ఇతరత్రా చార్జీ ల పెంపు కూడా వారికి నచ్చడం లేదు. అందుకే.. తమ వ్యతిరేకతను గ్రాడ్యుయేట్ ఎన్నికల సమయంలో ఓట్లరూపంలో చూపించారనే వాదన కూడా ఉంది. వెరసి.. మొత్తంగా.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. పెంచిన ధరలను తగ్గించకపోయినా.. కొత్తగా పన్నులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ ఆగ్రహం తగ్గించే అవకాశం ఉంది.
ఇక, మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వాదన కూడా ప్రజలకు రుచించడం లేదు. దశల వారీగా మద్య నిషేధం అని చెప్పిన జగన్.. ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదనే వాదన ఉంది. పైగా ధరలు పెంచి.. పిచ్చి మందు తాగిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదేసమయంలో పాతిక సంవత్సరాలకు..మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు చేయడం కూడా మైనస్ అయింది. ఈ పరిణామాలపైనా.. జగన్ దృష్టి పెట్టాలి.