మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీడీపీ తరఫున ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు పలువురు టీడీపీ నేతలు ముమ్మరంగ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లోకేష్… సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.
జగన్ రెడ్డిది దరిద్రపు పాదం అని, ఏపీ సీఎంగా జగన్ అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ సమస్యలేనని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ తో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని… కరోనా కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని విమర్శించారు. మీరెవరైనా సుఖంగా, హాయిగా బ్రతికారా అంటూ ప్రజలను లోకేష్ ప్రశ్నించగా….లేదు అంటూ రోడ్ షో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.
జగన్ ది ఐరన్ లెగ్ అని… ఇటు నుండి రూ.100 ఇచ్చినట్టే ఇచ్చిన జగన్… అటు నుండి రూ.1000 లాక్కుంటాడని లోకేష్ షాకింగ్ కామెంట్లు చేశారు. రేషన్ డోర్ డెలివరీ అంటూ పెద్ద పెద్ద యాడ్స్ వేశారని, కానీ, ఆ వ్యాన్ డోర్ దగ్గరికే జనం వెళ్లి పడిగాపులు కాస్తున్నారని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు జనం ఓట్లతోనే బుద్ధి చెప్పాలని లోకేష్ పిలుపునిచ్చారు.
రేషన్ డోర్ డెలివరీ అంటూ 10 వేల రేషన్ డెలివరీ వాహనాల కోసం దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. దానికి బదులుగా ప్రజలకు మంచి చేసే వేరే పథకం, అన్నా కాంటీన్ వంటివి ప్రారంభిస్తే బావుండేది కదా అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్ మస్ కానుక వంటి వాటికి ఖర్చుపెట్టేందుకు జగన్ దగ్గర డబ్బులు లేవని ఎద్దేవా చేశారు.