“ఈ సంవత్సరం దసరా నుంచి మీ బిడ్డ తన కాపురాన్ని విశాఖకు తరలిస్తున్నాడు“ అని కొన్ని నెలల కిందట ప్రకటించిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అనుకున్న ప్రకారమే తన బసను మార్చడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా విభజన చట్టంలోని కొన్ని అంశాలను అడ్డు పెట్టుకుని ఏకంగా ప్రభుత్వాన్నే తరలించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తాజాగా బుధవారం రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు.
“ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం.. రాష్ట్రం యొక్క సామరస్య, సమతుల్య అభివృద్ధిని సమీక్షిస్తూ.. వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఉత్తర కోస్తా జిల్లాలు అనగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రభుత్వ సీనియర్ అధికారులు విశాఖపట్నంలో రాత్రిపూట బస చేయడానికి తగిన వసతిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటిని ఏర్పాటు చేస్తున్నాం“ అని జీవోలో పేర్కొన్నారు. అంటే.. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ మాత్రమే విశాఖకు వెళ్తారని, మిగిలిన ప్రభుత్వ శాఖలు అన్నీ కూడాప్రస్తుతం ఉన్న చోట నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తాయని అందరూ భావించారు.
నిజానికి హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూడా ప్రభుత్వ కార్యాలను మార్చడానికి, రాజధాని స్వరూపాన్ని మార్చేందుకు కూడా వీలు లేదు. పైగా ప్రస్తుతం అమరావతి రాజధాని విషయం ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టుల విచారణ పరిధిలో ఉంది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని ఇప్పటికిప్పుడు మార్చేందుకు కానీ. సీఎం జగన్ అభీష్టం మేరకు మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు కానీ ఎలాంటి అవకాశం లేదు. అయినప్పటికీ.. మూడు రాజధానుల ఏర్పాటు ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిని చేయాలన్న పంతంతో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. ఆదిశగా ఇప్పటికే రుషి కొండపై ఇప్పటికే కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టారు.
దీంతో సీఎం ఒక్కరే తన ఫ్యామిలీని షిఫ్టు చేస్తారని అందరూ భావించారు. అయితే, దీనికి విరుద్ధంగా అటు కోర్టు న్యాయసూత్రాల కు, విచారణకు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. చాలా వ్యూహాత్మకంగా వైసీపీ ప్రభుత్వం పావులు కదిపింది. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అనుకూల అంశాలను అడ్డు పెట్టుకుని, మొత్తంగా తనతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను, మంత్రుల పేషీలను కూడా విశాఖకు తరలించేందుకు(ఉత్తరాంధ్ర) వీలుగా జీవోను విడుదల చేయడం, వసతికి తగిన భవనాలను వెతకాలని ఆదేశించడం గమనార్హం. మొత్తంగా రాజధాని అమరావతిపై వైసీపీ సర్కారు అనుకున్న విధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.