సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై విచారణలో ఉన్న కేసులను ఏడాది లోపు పూర్తి చేయాలన్న ప్రతిపాదన కొందరు రాజకీయ నేతల్లో గుబులు రేపిన సంగతి తెలిసిందే. దేశంలో ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఉన్నారు. దీంతో, సుప్రీంలో విచారణ మొదలైతే ఆ నేతలకు కౌంట్ డౌన్ షురూ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ పై ఉన్న కేసుల విచారణ కూడా ఏడాదిలోపు పూర్తవుతుందని, అలా జరిగితే ఆయన జైలుకెళ్లడం ఖాయమని విపక్ష నేతలు కొందరు విమర్శలు కూడా చేశారు. అందులోను, సుప్రీంకోర్టు జస్టిస్కే కులం, రాజకీయం అంటగడుతూ జగన్ రాసిన లేఖ న్యాయవర్గాల్లో కాక రేపింది. అయితే, రేపో మాపో జగన్ జైలుకెళ్లడం ఖాయమని, అందుకే, జడ్జిలపై ఈ కామెంట్లు చేసి సానుభూతి పొందాలని జగన్ చూశారని కొందరు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
కేసుల విచారణ ఊపందుకుంటే జగన్ జైలుకెళ్లడం ఖాయమేనని చాలామంది అడ్వకేట్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్ జైలుకెళతారని…ఆయన భార్య భారతి సీఎం అవుతారని విష్ణుకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ ప్రచారం చాలాకాలంగా జరుగుతోందని, అందరూ అనుకునేదే తాను చెప్పానని, అలా చెప్పడానికి తాను భయపడనని కుండ బద్దలు కొట్టారు విష్ణుకుమార్ రాజు.
జగన్ నియంత అని.. ఉత్తర కొరియా అధినేత కిమ్ వంటి వారని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఆంధ్రా కిమ్ అని పిలుచుకోవచ్చని ఆయన సెటైర్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వద్దంటూ జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రెండున్నరేళ్లలో మంత్రి వర్గం కాదు…సీఎం మారిపోతున్నారని జోస్యం చెప్పారు. డిప్యూటీ సీఎంలుగా మహిళున్నారని, తన భార్యకు డైరెక్టుగా జగన్ సీఎం పోస్టు ఇస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు.
జగన్ కంటే భారతీయే బెటరని షాకింగ్ కామెంట్లు చేశారు. విష్ణుకుమార్ రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు కేంద్రం నుంచి ఏమన్నా సమాచారం లీకయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు, జగన్ కూడా అప్పు సప్పు చేసి మరీ ఇచ్చిన హామీలన్నీ ఏడాదిన్నర కాలంలోనే పూర్తి చేయాలని చూడడం కూడా ఆ అనుమానాలకు బలమిస్తోంది. మరి, విష్ణుకుమార్ జోస్యం చెప్పినట్టు జగన్ జైలుకు వెళ్లి…భారతి సీఎం అవుతారా లేదా అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.