పోలవరం ప్రాజెక్టు 70 శాతం ప్రాజెక్టు పూర్తి చేసి అప్పగిస్తే… తర్వాత కొంచెం కూడా పనులు ముందుకు సాగడం లేదని చంద్రబాబు మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వాస్తవానికి ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ ఏపీ సర్కారు రివర్స్ టెండరింగ్ పేరిట కాలయాపన చేసిందని చంద్రబాబు ఆరోపించారు.
ఈ దశలో పోలవరం అన్నది పూర్తి చేయడం తమ వల్ల కాదని జగన్ చెప్పి తప్పుకుంటే తామంతా కలిసి పూర్తి చేసి చూపిస్తామని టీడీపీ సవాలు విసురుతోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు స్వపక్ష, విపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది.
ముఖ్యమంత్రి చెబుతున్న విధంగా బ్యాక్ వాటర్ లెక్క తేలాక ప్రాజెక్టు ప్రగతి ఉంటుందన్నది తేలిపోయింది. అదేవిధంగా పరిహారాలు లెక్క తేల్చాల్సి ఉంది. అందుకు సీఎం చెబుతున్న విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. పరిహారం, పునరావాసం, ప్రాజెక్టు పూర్తి అన్నవి ఇప్పుడు ఏ ప్రభుత్వానికి అయినా సవాళ్లే ! కానీ కేంద్రం సాయంతో వాటిని సునాయాసంగా అధిగమించవచ్చు. ప్రాజెక్టు పనులలో వేగం లేని కారణంగా తాము అడిగినంత నిధులు ఇవ్వడం లేదని కూడా కేంద్రం అంటోంది.
పోలవరం అన్నది జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ సవరించిన వివరం ప్రకారం యాభై వేల కోట్ల రూపాయలు ఇవ్వలేమని తేల్చేసింది. ఇదే సమయంలో డిజైన్, ప్రాజెక్టు ఎత్తు , కాఫర్ డ్యామ్ లలో లోపాలు వీటన్నింటిపై కూడా పూర్తి స్థాయిలో నిపుణులతో అధ్యయనం చేయించాకే ప్రాజెక్టు విషయమై ముందుకు పోవాలని కూడా భావిస్తోంది. ముఖ్యంగా ప్రాజెక్టు పనుల్లో వేగం లేదు సరిగా లేదు అంతేకాదు నాణ్యత కూడా లేదు అని మొన్నటి వరదల వేళ తేలిపోయాక కేంద్రం మరోసారి ఆలోచనలో పడింది.
నిపుణుల అధ్యయనం తరువాత నిధుల లెక్క తేల్చాలని భావిస్తోంది. ముఖ్యంగా పరిహారం లెక్కలకు సంబంధించి కేంద్రంను అడుగుతున్న విధంగా రాష్ట్ర సర్కారు నిధులు పొందలేదు. అందుకు కొంత ప్రత్యామ్నాయం వెతకాలి. అదేవిధంగా ఇప్పటిదాకా విలీన మండలాల సమస్యలేవీ ఈ ఎనిమిదేళ్లలో లేవు కానీ ఇప్పుడు మాత్రం వెలుగుచూస్తున్నాయి.
భారీ గా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరాక ముంపు గ్రామాల లెక్క ఒకటి మరోసారి లోకానికి తెలిసింది. దీంతో ఇక్కడ ఉండే కన్నా తమను తెలంగాణలో కలిపేయడం బెటర్ అని ఎటపాక వాస్తవ్యులు కోరుతున్నారు. అంటే జగన్ కన్నా కేసీఆర్ సర్కారే తమను బాగా చూసుకుంటుందని బాధిత వర్గాలు భావిస్తున్నాయి.
ఈ దశలో టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు నిన్నటి వేళ సంచలనాత్మకం అయ్యాయి. ఫ్యాన్ స్విచ్ ఆపితేనే రాష్ట్రానికి భవిష్యత్ అని పేర్కొంటూ పోలవరం ముంపు గ్రామాలను నిన్నటి వేళ సందర్శించి సంబంధిత బాధితులతో మాట్లాడారు.