టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యడీషిషల్ రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు, చంద్రబాబు న్యాయవాదులు విజయవాడలోని కోర్టులో ఆయన హౌస్ రిమాండ్ కోసం వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈరోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబుకు జాతీయ స్థాయి నేతలు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
దేశంలోనే పేరు ప్రతిష్టలు ఉన్న సీనియర్ రాజకీయనేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అరెస్టును వారు ఖండిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపుగా ఉందని, ఆయనను అరెస్టు చేసిన తీరు సరికాదని జగన్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. టిడిపి పాలనలో ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడాలని, విచారణ జరిపించాలని అన్నారు. అంతేగానీ, కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.
కాగా, చంద్రబాబు అరెస్టు చేసిన విధానం సరికాదని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా అరెస్ట్ చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను బిజెపి తప్పుబడుతోందని చెప్పారు. మరోవైపు, చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కూడా ఖండించారు. చంద్రబాబు అరెస్టు సరైనదిగా కనిపించడం లేదని, ప్రతీకార రాజకీయాలు గతంలో లేవని అన్నారు. జగన్ వచ్చిన తర్వాతే రాజకీయాలు భ్రష్టుపట్టాయని, కక్ష సాధింపు చర్యలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని చెప్పారు. మోడీ, అమిత్ షాలు మొదలుపెట్టిన రాజకీయాలను జగన్ కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.