సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తుంటారన్న సంగతి తెలిసిందే. జగన్ మావాడే అంటూనే…చురకలంటించడం జేసీ నైజం. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనవసరంగా కేసులు బనాయించి కక్ష సాధిస్తున్నారని జేసీ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ పై జేసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక రోజు ఆదాయం రూ.300 కోట్లు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్ ఆదాయం విషయంలో నిజానిజాలేంటో తనకు తెలీదని, కానీ, ఈ వ్యవహారంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని జేసీ చెప్పారు. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంను టీడీపీ అధినేత చంద్రబాబు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని జేసీ కితాబిచ్చారు. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు.
కుప్పంలో అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారని, అభివృద్ధి చూసి వైసీపీకి ఓటేశారని చెప్పడం అబద్ధమని, అదంతా దొంగ మాట అని.. జేసీ దుయ్యబట్టారు. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసని జేసీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాగా, తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్యపై కూడా జేసీ స్పందించారు. ఆ హత్యకేసులో అన్ని ఆధారాలున్నప్పుడు విచారణ ఎందుకని జేసీ ప్రశ్నించారు.