అంతా అనుకున్న విధంగా రాజ్యసభ ఎన్నికకు సంబంధించి ఏ అడ్డంకులూ లేకుండా పోయాయి. నిబంధనల అనుసారం సీఎం జగన్ తరఫున ఆ నలుగురూ పెద్దల సభకు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో వైసీపీ బలం కూడా పెరిగింది. ప్రాంతీయ పార్టీల రీత్యా కూడా వైసీపీ బలం పెరిగింది. ఆ విధంగా రాష్ట్రం తరఫున మాట్లాడే పెద్దల సంఖ్య పెరిగింది. కానీ ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన వారు కానీ లేదా పాత వారు కానీ ఏ మేరకు రాణిస్తారు అన్నదే ఇప్పుడొక సందేహం.
ఆంధ్రావని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ లీడర్ (తనని తాను జాతీయ స్థాయి బీసీ లీడర్ ని అని అభివర్ణించుకునే లీడర్) ఆర్.కృష్ణయ్య ఇకపై ఏ విధంగా ఏపీ తరఫున గొంతుక వినిపిస్తారో చూడాలి. ముఖ్యంగా ఆయన ఎంపికపైనే పలు అనుమానాలు ఉన్నాయి అని వైసీపీ ప్రయివేటు సంభాషణల్లో వినిపిస్తున్న మాట.
గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి టీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ నుంచి వైసీపీకి ఇలా పలు పార్టీల మీదుగా ప్రయాణం చేసిన ఆ నేత అంటే ఆంధ్రావని కి చెందిన అధికార పార్టీ నాయకులకు పెద్దగా నమ్మకాలు లేవు. టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యే అయినప్పటికీ తరువాత కూడా ఆ పార్టీకి పెద్దగా ఆయన ఉపయోగపడలేదు అన్న విమర్శలూ ఉన్నాయి. ఓ సందర్భంలో జగన్ ను ఆయన విషయమై వద్దని వారించారు కొందరు. కానీ తనకు కొన్ని ఒత్తిళ్లున్నాయని చేయక తప్పదని ఆర్.కృష్ణయ్యను తెరపైకి తెచ్చారు.
ఇక ఇప్పటికే ఆయనపై ఓ తగాదాలో నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ అయి ఉంది. ఆ తగాదా గురించి తెలంగాణలో విపరీతం అయిన చర్చ ఒకటి నడుస్తోంది. కృష్ణయ్య పెద్దగా మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉన్న వారు కాదని, ఆయన్ను ఎలా ఎంపిక చేశారో తమకు అర్థమే కావడం లేదు అని తెలంగాణ నుంచి కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి.
ఎంపికయిన వారిలో మరో నేత బీద మస్తాన్ రావుపై కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఫక్తు తెలుగుదేశం పార్టీ మనిషి అని, ఆయన సోదరుడు బీద రవిచంద్ర ఇప్పటికీ నెల్లూరు కేంద్రంగా టీడీపీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నందున మస్తాన్ రావు కూడా అవకాశం ఉంటే అటువైపే మొగ్గు చూపేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్న టాక్ కూడా నడుస్తోంది. మరి! ఈ ఇద్దరూ వైసీపీకి ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా ప్లస్ అవుతారో అన్నది ముందున్న కాలమే చెప్పాలి.