“రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అంత మాత్రాన మా సంతోషాలు మానుకోవాలా? మా సంబరాలు వదు లుకోవాలా?“-ఇదీ ఇప్పుడు ఏపీ ప్రజలు సంధిస్తున్న ప్రశ్న. అంతేకాదు, చంద్రబాబు కన్నా ఎక్కువగా మా మొహంలో చిరునవ్వు చూస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ మేరకు చేయడం లేదని వారు బాహాటంగానే విమర్శలు సంధిస్తున్నారు. దీంతో అసలు ఏమైంది? ఎందుకు ప్రజలిలా నొచ్చుకుంటు న్నారు? అని ఆరాతీస్తే.. ఆసక్తికర విషయం వెలుగు చూసింది. “తిని తొంగుంటే.. మనిషి-గొడ్డుకు తేడా ఏం ఉంటుంది చెప్పండి?.. ఎంతో కొంత వినోదం, సంతోషం ఉండాలి కదా?!“ అని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. పండగలు వస్తున్నాయంటే.. ముందుగానే ప్రభుత్వం ప్లాన్ చేసుకుని అనేక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేది. పుష్కరాలు, శివరాత్రి, దసరా ఉత్సవాలు వంటివి వచ్చాయంటే.. ప్రజలకు పండగే పండగ. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహించేందుకు వివిధ మార్గాల్లో ప్రజలకు చేరువ అయ్యేది. ఈ క్రమంలోనే నాటక పోటీలనీ… పాటల పోటీలని.. నిర్వహించేది. ప్రతి ఆదివారం వివిధ నగరాల్లో యువతకు పోటీలు నిర్వహించేవారు. ఏటా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేవారు. జాతీయ పండగలు కూడా భారీగా జరిపేవారు.
దీంతో పిల్లలకు, యువతకు ఆటపట్టుగా ఉండేవి. ఇక, పెద్దలు కూడా ఆయా కార్యక్రమాల్లో పడి సమయం గడిపేసేవారు. అదేసమయంలో ఏటా విశాఖలో గాలి పటాల పండగను నిర్వహించేలా కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యాటకాన్ని ఎంతో ప్రోత్సహించారు. నదులకు హారతులు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు జగన్ సర్కారు మాత్రం ఏదో పాలిస్తున్నాం.. పథకాలు అమలు చేస్తున్నాం.. అంటూ.. ప్రజలకు వినోదాన్ని పంచే ఏ కార్యక్రమాన్నీ పట్టించుకోవడం లేదు. దీంతో పర్యాటక శాఖ అసలు ఎందుకు ఉందో కూడా అర్ధం కావడం లేదు. అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా దసరా వస్తోందంటే..గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేసేది. యువతను ఈ పండగలో భాగం చేసేది. సంక్రాంతికి వారం ముందు నుంచి కార్యక్రమాలు రూపుదిద్దుకునేలా చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వాటి జోలికి కూడా పోవడం లేదు. దీంతో ప్రజలకు వినోదం చేరువ కావడం లేదదనేది వాస్తవమే అంటున్నారు మేధావులు కూడా. ఎన్ని కార్యక్రమాలుఅమలు చేసినా.. ప్రజలకు వినోదం కూడా పంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేది వీరి సూచన. ఏదేమైనా.. ప్రస్తుత దసరా ముగిసినా.. దాని తాలూకు ఆనందం మాత్రం ప్రజల్లో కనిపించకపోవడం లోటుగానే ఉందని అంటున్నారు.
ఎంత కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ.. కొన్నింటికైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో ప్రజల్లో నైరాశ్య అలుముకుందని చెబుతున్నారు. ఫలితంగా గత ప్రభుత్వం తాలూకు జ్ఞాపకాల్లో కాలం వెళ్లదీశారని అంటున్నారు. బాబు మార్కు కాకపోయినా.. ప్రజలకు వినోదం పంచడంలో జగన్ విభిన్న శైలిని అవలంభిస్తే.. బాగుండేదని.. వచ్చే సంక్రాంతికైనా ఆ దిశగా ఆలోచన చేయాలని సూచిస్తున్నారు.