ఏపీ మాజీ సీఎం జగన్ కు సీఎం చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. వినుకొండలో రషీద్ అనే యువకుడి హత్య నేపథ్యంలో 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారని జగన్ చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రషీద్ ను చంపినవాళ్లను అరెస్ట్ చేశామని, జగన్ కు ధైర్యం ఉంటే, సిగ్గుంటే, నీజాయతీ ఉంటే ఆ 36 పేర్లు ఇవ్వాలని సవాల్ విసిరారు.
‘‘గతంలో నువ్వు చంపిన వాళ్ల పేర్లు నేనిచ్చాను… ఇప్పుడు వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటా… మళ్లీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తాం… ఇవాళ నువ్వు చెబుతున్న వాటిపై కూడా నేను చర్యలు తీసుకుంటా… సిద్ధమా?’’ చంద్రబాబు సవాల్ విసిరారు.
మాయ మాటలు మాట్లాడకు… దొంగ ఏడుపులు వద్దు… నంగి మాటలు వద్దు నేను చాలా స్పష్టంగా చెప్పాను…36 మంది పేర్లు వారం నుంచి అడుగుతున్నాం..సిగ్గుంటే ఇవ్వాలి అని అసెంబ్లీలో చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ ది లెక్కలేనితనం అని, ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్ముతారు అని అనుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఓ చెత్త పేపర్ పెట్టుకున్నా…ఇష్టం వచ్చినది రాస్తాను..జనం నమ్ముతారు అంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. ప్రజా చైతన్యం వస్తేనే ఇలాంటి సమస్యలకు విరుగుడు అని చంద్రబాబు సభలో అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
“రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు… ఎవరీ రషీద్? చంపినవాడెవడు? చచ్చినవాడెవడు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? సరే అది అయిపోయింది… 36 మంది చనిపోయారని గవర్నర్ వద్దకు వెళ్లావు… ఆ 36 మంది పేర్లు ఇవ్వండి’’ అని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు చేస్తే తమ పార్టీ వాళ్లనైనా శిక్షిస్తానని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, ఆ ముసుగు తీస్తామని, నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.