రోడ్డు పక్కన టీ కొట్టు అమ్మే టీ కంటే తక్కువ ధరలో రెండున్నర గంటల పాటు వెండి తెర మీద సినిమా వేయకపోవటానికి మించిన దారుణం.. ద్రోహం ఏముంటుంది? సినిమా వ్యాపారమే కావొచ్చు.. అంత మాత్రానికి పేదల రక్తాన్ని పీల్చే దుర్మార్గం ఎక్కడిది?
జగన్ రాజ్యంలో సినిమా టికెట్లు కారుచౌకగా ఉండాలి. ఎందుకంటే.. చౌకైన వినోదం మా ప్రభుత్వ పాలసీ అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన బ్యాచ్ గడిచిన కొద్ది రోజులుగా తమ నోటికి తాళాలు వేసుకొని కూర్చోవటం ఏ మాత్రం బాగోలేదు. ఎందుకంటే.. చౌక వినోదం కోసం అంతలా విరుచుకుపడిన వారు.. తిరుమల లాంటి అధ్యాత్మిక కేంద్రంలో స్వామివారిని దర్శించుకొని.. తమకు తాహతుకు తగ్గట్లు ఆర్జిత సేవలు చేయించుకోవాలన్న ఆకాంక్షకు చెక్ పెట్టేలా దారుణంగా ధరలు పెంచేసిన వైనం మీద ఎందుకు మాట్లాడటం లేదు?
వ్యాపారం చేస్తున్నామని చెప్పి.. సినిమాలు చేస్తున్న వారి చెవి మెలేసి.. రూ.5 టికెట్టు ధరను డిసైడ్ చేసిన ప్రభుత్వానికి మద్దతుగా వాదనలు వినిపించిన వారు.. దేవుడి పేరుతో ధరల్ని పెంచేస్తున్న వైనంపైనా గళం విప్పాలి కదా?
ఈ మధ్యన టీటీడీ బోర్డు కూర్చొని ఆర్జిత సేవల ధరల్ని ఎంత పెంచాలన్న దానిపై జరిగిన సమావేశానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బయటకు రావటం.. అది కాస్తా వైరల్ కావటం తెలిసిందే. భక్తుల మనోభావాల్ని పెద్దగా పట్టించుకోకుండా తమకు తోచిన రీతిలో ధరల్ని పెంచేసిన వైనాన్ని చూసినోళ్ల నోట మాట రాని పరిస్థితి.
వ్యాపారంలో భాగంగా సినిమాలు తీసే వారికి క్లాసులు పీకే వాళ్లంతా.. టీటీడీ బోర్డు మీటింగ్ తీరు మీద నోరు మెదపకపోవటం దేనికి నిదర్శనం? ఒక అధ్యాత్మిక కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బోర్డు.. ఫక్తు వ్యాపార సంస్థకు మించిన బరితెగింపుతో.. ఎలాంటి లాజిక్కులకు అందని రీతిలో ధరల్ని పెంచేయటం దేనికి నిదర్శనం?
టీటీడీ పదవులు అలంకరించిన వారి తీరు చూస్తే.. ఆర్జిత సేవలు ఏవైనా డబ్బులున్నోళ్లు.. సంపన్నులు మాత్రమే తప్పించి మధ్య తరగతి.. దిగువ మధ్య తరగతివారు అస్సలు ఆలోచించకూడదన్నట్లుగా ఉందన్నది మర్చిపోకూడదు.
సినిమా టికెట్ల ధరల్ని తగ్గించటాన్ని సమర్థించుకున్న వారు.. అంతే తెగింపుతో టీటీడీ ఆర్జిత ధరల్ని పెంచటాన్ని కూడా సమర్థిస్తే మరింత బాగుంటుందేమో. ప్రపంచంలో దేని ధరలైనా పెరుగుతున్న ఇప్పటి రోజుల్లో అందుకు భిన్నంగా దారుణంగా తగ్గించేయటం దేనికి నిదర్శనమన్నది చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేదే.
ఒకవేళ.. చౌక వినోదం కాన్సెప్టు మీద నమ్మకం ఉంటే.. టీటీడీ పెంచేసిన ఆర్జిత సేవల్ని తగ్గించటమే కాదు.. గతంలో ఉన్న ధరలకు మరింత కోత పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే చౌక వినోదం మీద మాట్లాడే అర్హత.. హక్కు ఉంటుందన్నది మర్చిపోకూడదు.